Maharashtra bus accident today : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బుల్దానాలో జిల్లాలోని సిండ్ఖేడ్రాజా ప్రాంతంలో సమృద్ధి మార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం వేకువజామున 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్‌పుర్ నుంచి పుణెకు 33 మందితో వెళ్తోంది. ఒక్కసారిగా టైరు పేలడం వల్ల వాహనం అదుపు తప్పింది. పక్కన ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కొందరు స్థానికులు.. అధికారులకు తమవంతు సాయం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిస్థాయిలో కాలిపోయింది. సగం కాలి, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడినట్లు బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే వెల్లడించారు. టైరు పేలడం వల్లే బస్సు అదుపు తప్పిందని, మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.
ప్రముఖుల సంతాపం..
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు పరిహారం ఇస్తామని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
బుల్డానా దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.