Manipur election 2022: కల్లోలిత మయన్మార్ సరిహద్దుల్లోని మణిపుర్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదేళ్ల కిందట అనూహ్య పరిస్థితుల్లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుండగా.. అధికారంలో కొనసాగేందుకు కమలదళం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
భాజపా డబుల్ ఇంజిన్ నినాదంతో..
ఐదేళ్ల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో తమకు అండగా నిలిచిన ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీలతో పొత్తు లేకుండానే ప్రస్తుతం కమలదళం ఎన్నికల బరిలో దిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. కేంద్రంలోనూ అధికారంలో ఉండటం మణిపుర్‌లో భాజపాకు బాగా కలిసొచ్చే అంశం. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే రాష్ట్రంలోనూ పగ్గాలు అప్పజెప్పేందుకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొగ్గుచూపుతుంటారు. అందుకే- ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'డబుల్ ఇంజిన్ అభివృద్ధి' నినాదాన్ని ఇక్కడ కమలనాథులు ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు.
టికెట్ల పంపిణీపై రగడ
ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ.. టికెట్ల పంపిణీ వ్యవహారం ప్రస్తుతం భాజపాలో అంతర్గతంగా దుమారం రేపుతోంది. టికెట్ దక్కకపోవడంతో నిరాశచెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు- పి.శరత్‌చంద్ర, ఎం.రామేశ్వర్, వై.ఎరాబొత్ సింగ్ భాజపాకు రాజీనామా చేశారు. తనకు విధేయులుగా ఉండేవారు, బంధువులకే టికెట్ల కేటాయింపులో సీఎం బీరేన్ సింగ్ పెద్దపీట వేశారని ఆరోపణలొస్తున్నాయి. గత ఏడాది నవంబరులోనే పార్టీలో చేరిన సీఎం బంధువు రాజ్‌కుమార్ ఇమో సింగ్ (సగోల్‌బంద్), బీరేన్ సింగ్ సన్నిహితురాలిగా పేరున్న ఎస్.ఎస్.ఓలిష్ (చండేల్)లకు టికెట్లు దక్కడాన్ని అందుకు ఉదాహరణలుగా పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ జీవన్మరణ పోరాటం
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దశాబ్దాలుగా మంచి పట్టుంది. 2002 నుంచి 2017 వరకు ఏకధాటిగా ఇక్కడ పార్టీ పాలనే కొనసాగింది. ఆ 15 ఏళ్లూ ఓక్రం ఇబోబి సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 28 సీట్లు గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. 21 స్థానాలే గెల్చుకున్న కమలదళం.. ఫలితాల ప్రకటన తర్వాత చకచకా పావులు కదిపింది. నలుగురు ఎన్‌పీఎఫ్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎన్‌పీపీ శాసనసభ్యులతోపాటు తృణమూల్ కాంగ్రెస్(1), లోక్ జనశక్తి పార్టీ(1), స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. పలువురు నేతలు పార్టీని వీడారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవిందాస్ కొంథౌజమ్ కాషాయ కండువా కప్పుకొన్నాక.. గత ఏడాది ఆగస్టులో ఒకేసారి ఐదుగురు ఎమ్మెల్యేలు ఆయన బాటలో కమలం గూటికి చేరడం పెద్ద ఎదురుదెబ్బ. ఈశాన్య రాష్ట్రాల్లో తమ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో.. మణిపుర్ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు జీవన్మరణ పోరాటంలా భావిస్తున్నారు! ప్రస్తుత ఎన్నికల్లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, జేడీ(ఎస్), ఫార్వర్డ్ బ్లాక్‌లతో కాంగ్రెస్ కూటమిగా ఏర్పడింది.
ఇబోబి సింగ్ నేతృత్వంలోనే..
ఇబోబి సింగ్ నేతృత్వంలోనే కాంగ్రెస్ తాజా ఎన్నికల బరిలో దిగింది. అయితే ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఇప్పటికీ ప్రకటించలేదు. దీనిపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలోని సీనియర్లతో విభేదించేందుకు ఎన్నడూ వెనకాడని తత్వమే ఇబోబి సింగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడానికి కారణమని విశ్లేషణలొస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ మణిపుర్‌లో పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్నారు. ఇబోబి-జైరాం సమన్వయంతో పనిచేసి పార్టీని విజయతీరాలకు చేరుస్తారని అధిష్ఠానం ఆశిస్తోంది.
ఎన్‌పీఎఫ్, ఎన్‌పీపీలూ కీలకం
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీకి మణిపుర్‌లో ప్రజాదరణ బాగానే ఉంది. ఇక్కడ భాజపా తర్వాత టికెట్ కోసం ఎక్కువమంది పోటీ పడుతున్నది ఆ పార్టీలోనే! మేఘాలయలో సంగ్మాకు కమలదళం మద్దతు ఉంది. మరోవైపు- కేంద్రంతోపాటు మణిపుర్, నాగాలాండ్‌లలో భాజపాతో ఎన్‌పీఎఫ్‌కు సత్సంబంధాలే ఉన్నాయి! మణిపుర్‌లో ప్రస్తుతం 15 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్‌పీఎఫ్ నిర్ణయించుకుంది. ఐదేళ్ల కిందటిలా మరోసారి ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పాలని ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ భావిస్తున్నాయి.
మణిపుర్ జనాభాలో 53% పైగా ప్రజలు మీటీ వర్గంవారే. వీరు హిందువులు. వీరి తర్వాత అత్యధికంగా ఉన్న కుకీలు, నాగాలు.. క్రైస్తవులు. కొండప్రాంతంలోని జిల్లాల్లో భూ సంబంధిత, సామాజిక అంశాలపై కుకీలు, నాగాల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కుకీలు దీర్ఘకాలంగా కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారు.
ఎన్నికలను ప్రభావితం చేయగల అంశాలు
- నిరుద్యోగిత
- అంతర్గత భద్రత
- రాజకీయ అస్థిరత
- మణిపుర్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 60
- ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ: 31
ఎన్నికలు జరగనున్న తేదీలు
- ఫిబ్రవరి 27, మార్చి 3 (రెండు విడతల్లో)
- ఫలితాల వెల్లడి మార్చి 10
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్- సామాన్యులకు నమ్మకద్రోహం!'