Mamata Banerjee Meeting With Pm: పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. బీఎస్ఎఫ్ ప్రాదేశిక పరిధి పొడిగింపు సహా బంగాల్‌కు సంబంధించిన సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. బంగాల్‌లో బీఎస్ఎఫ్ ప్రాదేశిక పరిధి పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొద్దని ప్రధాని మోదీకి సూచించినట్లు పేర్కొన్నారు.
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన దీదీ... వచ్చే ఏడాది బంగాల్‌లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. త్రిపురలో జరిగిన హింసలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై భాజపా నాయకులు దాడి చేసిన విషయాన్ని మోదీ దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav news) తమ మద్దతు కావాలని కోరితే తప్పకుండా ఇస్తామని అన్నారు మమత. పంజాబ్ ఎన్నికల్లో నేతలందరూ బిజీగా ఉన్నారన్న మమతా.. ప్రధాని అపాయింట్మెంట్ తప్ప మరొకరిది తాను కోరలేదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో ముంబయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలుస్తానని మమత చెప్పారు.
నేను పనిచేసిన వారిలో మమత ప్రత్యేకం...
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి దిల్లీలో సమావేశమయ్యారు. ఆమెతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు స్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్‌లో మీరూ చేరతారా అని పాత్రికేయులు అడిన ప్రశ్నకు సమాధానంగా.. "నేను ఇప్పటికే ఆమెతో ఉన్నాను. నేను చేరాల్సిన అవసరం లేదు" అని అన్నారు. తాను కలిసిన లేదా కలిసి పనిచేసిన రాజకీయ నాయకులందరిలో మమతా బెనర్జీ, జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు ప్రత్యేకమని స్వామి ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: ఎప్పటికీ నేనే 'సారథి'ని.. జీప్ డ్రైవ్ చేస్తూ లాలూ మెసేజ్!