Major Road Accident in Mahbubnagar District : మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం(Road Accident) ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శుక్రవారం సంత జరగడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం మండల కేంద్రానికి వచ్చారు. కొందరు సంతలో సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం కోసం రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇంకొందరు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా దూసుకువచ్చింది. రోడ్డు పక్కన నిలబడ్డ వారిని, బైక్ పై రోడ్డు దాటుతున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు(Road Accident in Mahabubnagar), ఓ వృద్ధురాలు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి, ఒకరిని షాద్‌నగర్‌కు హుటాహుటిన తరలించారు.
5 People Died in Road Accident at Mahabubnagar : ప్రమాదానికి గురైన వారిలోని మహబూబ్‌నగర్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాలనగర్ మండలం బీబీనగర్ తండా గ్రామపంచాయతీ లోక్యానాయక్ తండాకు చెందిన పన్ను ఆమె మూడేళ్ల జున్ను ప్రాణాలు కోల్పోయింది. పాప సోదరి మౌనిక మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మోతి ఘనపూర్‌కు చెందిన సునీత ఆమె 8 ఏళ్ల కూతురు మోక్షిత ఈ ప్రమాదంలో మృత్యువాత పడింది. తీవ్రంగా గాయపడిన సునీత భర్త రాజును షాద్‌నగర్‌కు తరలించారు. బాలనగర్ మండల కేంద్రానికి చెందిన పదేళ్ల బాలుడు జశ్వంత్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన భద్రూసింగ్ను తొలత మహబూబ్‌నగర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక తనువు చాలించిన విద్యార్థిని
డీసీఎం బలంగా ఢీ కొట్టడంతో క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అక్కడి ప్రమాద దృశ్యాలు భీతవహాంగా మారాయి. దీంతో ఆగ్రహానికి గురైన జనం హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహాదారిపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డీసీఎంకు నిప్పు పెట్టారు. సంత ఉందని తెలిసినా సరైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టలేదని, బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించలేదని పోలీసులపై దాడికి దిగారు. రద్దీ అధికంగా ఉన్నా అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప సహా పోలీసులపై ఆందోళన కారులు ఎదురుతిరిగారు.
అప్రమత్తమైన కొందరు సీఐ జములప్పను ఓ దుకాణంలోకి తీసుకెళ్లారు. జాతీయ రహాదారిపై 3గంటల పాటు ఆందోళన కారులు వాహనాలని నిలిపివేశారు. తగలబడుతున్న డీసీఎం మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాన్ని తిప్పిపంపారు. బాలనగర్‌కు ఇరువైపులా ఇటు షాద్‌నగర్ వరకూ, అటు రాజాపూర్ వరకూ కిలోమేటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ నుంచి అదనపు ఎస్పీ, డీఎస్పీ అధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్డారు. హైవేపై వాహనాల రాకపోకల్ని పునరుద్ధరించారు.
బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం
సుమారు నాలుగు గంటల పాటు బాలనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుల బంధువులు ఆరోపించారు. బాలనగర్ వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించు కోలేదని, సంత రోజు రద్దీ అధికంగా ఉంటుందని తెలిసినా ఒక్క పోలీసు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్, మహబూబ్ నగర్ ఎస్పీ జిల్లా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.