Maharashtra Landslide Incident : మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాయ్‌గఢ్ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటం వల్ల పెను విషాదం నెలకొంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించగా పదుల సంఖ్యలో ప్రజలు ఏమయ్యారో ఇప్పటివరకు తెలియరాలేదు. గల్లంతైన వారి కోసం వరుసగా నాలుగో రోజూ NDRF, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలించాయి. గ్రామస్థులు, అధికారుల సూచనతో సహాయక చర్యలను ముగిస్తున్నట్లు మంత్రి సాయంత్రం ప్రకటించారు.
శనివారం రాత్రి సరిగా వెలుతురు లేకపోవడం, వాతావరణ ప్రతికూలతల వల్ల సహాయక చర్యల్ని నిలిపివేసిన అధికారులు.. ఆదివారం ఉదయం మళ్లీ ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదని పేర్కొన్నారు. కొండచరియల కారణంగా కూలిన ఇళ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే.. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇర్షల్‌వాడీ గ్రామంలో మొత్తం 48 ఇళ్లు ఉండగా... 17 ఇళ్లు కొండచరియల కారణంగా ధ్వంసమయ్యాయి. ఆ గ్రామంలో 229 మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 27 మంది మృతిచెందగా..10 గాయపడ్డారు. 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియలేదు. ఘటన సమయంలో వీరిలో కొంతమంది.. గ్రామంలో లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండచరియల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగించే పని ముమ్మరం చేశారు.
ముఖ్యమంత్రి శిందే సందర్శన
ప్రమాదం జరిగిన ఇర్షల్‌వాడీ గ్రామస్థులను శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శనివారం పరామర్శించారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కేవలం ఇర్షల్‌వాడీ ప్రాంత ప్రజలనే కాకుండా అటువంటి అన్ని ప్రాంతాల్లోని ప్రజలను సమీప గ్రామాలు లేదా ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని సూచించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి శిందే ప్రకటించారు.