Maharashtra Road Accident Reasons : మహారాష్ట్ర బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదానికి.. టైర్ పేలిపోవడం, వేగంగా బస్సు నడపడంగానీ కారణం కాదని తేలింది. ఈ మేరకు అమరావతి రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ (ఆర్టీఓ) నివేదికను ఇచ్చారు. ప్రమాదం జరిగిన స్థలంలో రబ్బరు ముక్కలు గానీ, టైరులు గీసుకుపోయిన గుర్తులుగానీ లేవని ఆర్టీఓ తన నివేదికలో స్పష్టం చేశారు. మరి ఈ రెండూ కారణం కాకపోతే.. మరి ఈ ఘోర ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
26 మంది సజీవ దహనం
Maharashtra Bus Accident death toll : అంతకుముందు.. శనివారం వేకువజామున నాగ్‌పుర్ నుంచి పూణెకు 33 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు.. బుల్దానాలోని సింధ్ కేంద్రజా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది సజీవ దహనం అయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్, క్లీనర్ సహా మరికొందరు బస్సు కిటికీలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.
సకాలంలో సాయం అంది ఉంటే..
బస్సులో చిక్కుకున్నవారు రక్షించమని ఆర్తనాదాలు చేస్తున్నా.. అటుగా వెళ్తున్న వాహనదారులు ఎవరూ సాయం చేయలేదని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సకాలంలో సాయం అంది ఉంటే.. కనీసం కొంత మంది ప్రాణాలు అయినా కాపాడగలిగే వాళ్లమని ఆయన తెలిపారు. ప్రమాదం వార్త తెలియగానే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి నిజమైన కారణం ఏమిటి?
పోలీసుల అదుపులో ఉన్న బస్సు డ్రైవర్.. ప్రమాదానికి గల కారణాలపై భిన్నమైన సమాధానాలు ఇచ్చాడు. ముందుగా టైర్ పేలిందని, తరువాత బస్సు డివైడర్‌ను ఢీకొన్నట్లు.. డ్రైవర్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. దీనితో ఈ ఘటనపై మహారాష్ట్ర సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రముఖుల సంతాపం
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ వారి వైద్య ఖర్చులను భరిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున, గాయపడ్డవారికి 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
డీఎన్ఏ పరీక్షలు..
బస్సు ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స కోసం బుల్దానా జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉంటే డీఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు.