మహారాష్ట్ర బీడ్ జిల్లా అంబజోగై పట్టణంలో ఒకే చితిపై 8 మృతదేహాలను దహనం చేశారు అధికారులు. కరోనాతో చనిపోయిన వారిని దహనం చేయడానికి శ్మశానంలో స్థలం లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
"అంబజోగై పట్టణంలోని శ్మశానవాటికలో కరోనా రోగుల మృతదేహాలను దహనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. దీంతో బాధితుల అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి.. పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలో మాండవా రోడ్డులోని మరో స్థలంలో ఆ శవాలను దహనం చేశాం" అని మున్సిపల్ మండలి అధికారి అశోక్ సాబలే తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక శ్మశాన వాటిక పరిమిత స్థలంలో ఉందన్నారు అశోక్. దీంతో ఒకే చితిపై ఎనిమిది శవాలను పేర్చి దహనం చేసినట్లు పేర్కొన్నారు. కరోనా విజృంభణతో మరణాలు పెరిగే అవకాశముందని.. మరిన్ని తాత్కాలిక శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని.. వ్యాధి బారిన పడినవారు సరైన సమయంలో చికిత్స చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: టీకా పంపిణీలో ప్రపంచంలోనే భారత్ టాప్