మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు కరోనా సోకినట్టు వెల్లడైంది. ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో ఆయన ఏడో వ్యక్తి కావటం గమనార్హం. ఇప్పటి వరకు అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర షింగ్రే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్‌పాటిల్, బచ్చు కాడుకు కొవిడ్ వ్యాధి సోకింది. గతేడాది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా 12 మంది రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.
తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా ఆయన తెలిపారు. ఇటీవలి రెండు, మూడు రోజుల్లో తనకు సమీపంలో వచ్చిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కలవరానికి గురి చేస్తోంది. మహారాష్ట్ర, కేరళ వంటి తదితర రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ప్రభుత్వాలను పరుగులు పెట్టిస్తోంది. లాక్‌డౌన్, రాత్రికర్ఫ్యూ వంటి వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. ఇటీవల కాలంలో కొవిడ్ టీకాలకు అనుమతులు, పాజిటివ్ కేసుల్లో తగ్గుదలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొంది. అయితే గతవారం రోజుల్లో కొవిడ్ కేసుల్లో ఉన్నట్టుండి పెరుగుదల కనిపిస్తోంది. 15 వారాల అనంతరం కొత్త కేసులు భారీగా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కోటి పది లక్షల మందికి పైగా వైరస్ సోకగా..65 రోజుల్లో చివరి పది లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో 1,00,990 కేసులు బయటపడగా. గత వారంతో పోలిస్తే, 31 శాతం ఎక్కువకావడం గమనార్హం. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరగడం ఈ కొత్త కేసులకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే టీకాల రాకతో, ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్య వైఖరి కూడా కారణంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:దేశంలో 1.10కోట్లు దాటిన కరోనా కేసులు