మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. కత్తితో ఆమెపై దాడిచేసి కాలు, చెయ్యి నరికేశాడు. ఈ ఘటనలో నిందుతుడిని అదుపులోకి తీసుకున్నట్టు భోపాల్ ఎస్పీ అనిల్ త్రిపాఠి తెలిపారు.
ఏం జరిగిందంటే.?
ప్రీతమ్ రాజ్‌పుత్(28), సంగీత(26) దంపతులు. వీరు భోపాల్‌లోని విశ్వకర్మ నగర్లో నివాసముంటున్నారు. సంగీత ఇందోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ.. పదిహేను రోజులకోసారి ఇంటికొచ్చేది. ఈ విషయమై అసహనం వ్యక్తం చేసిన రాజ్‌పుత్.. ఆమె వారానికోసారి ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. ఆమె ఎడమ కాలు, ఎడమ చెయ్యి నరికేశాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలిని సమీపంలోని హమిదా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు అక్కడి వైద్యులు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాజ్‌పుత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్-307(హత్యాయత్నానికి పాల్పడటం) కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వివాహితకు మద్యం తాగించి.. ఆపై..!