కొవిడ్ టీకాలు వేయించుకోండి.. బోలెడు బహుమతులు గెలుచుకోండి..! లక్కీడ్రాలో వంట సామగ్రి, గృహోపకరణాలు, రేషన్ కిట్‌లు, ట్రావెల్ పాస్‌లు, నగదు బహుమతులు.. వంటివెన్నో దక్కించుకునే అవకాశం..! పూర్తిస్థాయి వ్యాక్సినేషన్(Covid vaccination) దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఎన్నో పథకాలతో కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు దేశంలో అర్హులైన వారంతా టీకాలు(Covid vaccination in India) తీసుకునేలా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇందులో భాగంగా లక్కీ డ్రాతో పాటు మరిన్ని కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు వెల్లడించాయి.
ఈమేరకు కేంద్రం త్వరలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నాయి. వ్యాక్సినేషన్(Corona vaccination) ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించాయి. ఈమేరకు జిల్లాలు లేదా గ్రామాల్లో ప్రజలను ప్రభావితం చేయగలిగే, పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందిన వ్యక్తులను గుర్తిస్తారు. వారి ద్వారా వివిధ వర్గాల ప్రజలను వ్యాక్సినేషన్‌కు ప్రోత్సహిస్తారు. ఇలాంటి వారిని ప్రచారకర్తలుగా నియమించి.. ప్రభుత్వం చేపట్టిన 'ఇంటింటికీ టీకా'పై వారికి శిక్షణ ఇస్తారు. వారంతా టీకా ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజెప్పి వేయించుకునేలా కృషి చేస్తారు.
అలాగే ఇంతవరకు టీకాలు పొందని వారి కోసం పనిప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ను(Corona vaccination in India) చేపడతారు. ప్రభుత్వ, పైవేటు కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నవారికి ప్రత్యేక బ్యాడ్జీలు అందజేయనున్నారు. "నేను పూర్తిస్థాయిలో టీకాలు పొందాను. మీరు కూడా తీసుకున్నారా" అనే సందేశం ఆ బ్యాడ్జీలపై ముద్రిస్తారు. వీటిద్వారా టీకాలు తీసుకోని సహచర ఉద్యోగులను ప్రోత్సహిస్తారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందేవారికి వారం వారం లేదా నెలకోసారి లక్కీ డ్రా ద్వారా వివిధ బహుమతులు కూడా అందజేయనున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో కొవిడ్ టీకాలకు అర్హులైన వారిలో 82 శాతం మంది తొలి డోసు తీసు కున్నారు. 43 శాతం మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పొందారు. తొలి డోసు తీసుకుని నిర్ణీత వ్యవధి దాటినా రెండో డోసు పొందనివారు దాదాపు 12 కోట్ల మంది ఉన్నారు.
ఇదీ చూడండి: Covid cases in India: 538 రోజుల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు