Bhupesh Baghel: ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా దెహ్రాదూన్‌లో జరిగిన కార్యక్రమంలో కీలక వాగ్దానం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఉత్తరాఖండ్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.500కు మించనివ్వబోమని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి 'చార్ ధామ్ చార్ కామ్' పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే పర్యటించి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
'ఓట్ల కోసమే భాజపా మతం కార్డు'
అంతకుముందు రాయ్‌పుర్ నుంచి దెహ్రాదూన్ బయల్దేరే ముందు స్వామి వివేకానంద విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు బఘేల్. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవలే ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన భాజపాపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ కేవలం ఓట్ల కోసమే మతం కార్డును ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కూడా కుల, మతాల సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని యూపీలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
"ప్రజలను భయపెట్టి భాజపా ఓట్లు సాధిస్తుంది. కులం, మతం పేర్లు చెప్పి ఓట్లు పొందుతుంది. కానీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం మేలు చేకూరింది? పీఠం కోసం ప్రజలను విడదీయడమే కమలం పార్టీ విధానం. ఆ పార్టీ ఎప్పుడూ హిందువుల గురించి మాట్లాడుతుంది. కానీ భాజపా వల్ల వారు ఏం సాధించారు. మొత్తం భాజపాకే మేలు జరిగింది. ఓటర్లకు కాదు"
-భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం
ఐఏఎస్ క్యాడర్ నిబంధనలు-1954కు సవరణలు చేసి రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం కోరుకుంటోందని బఘేల్ ఆరోపించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Uddhav Thackeray BJP: 'భాజపాతో దోస్తీ వల్ల 25 ఏళ్లు వృథా'