అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలపై పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు.. సోమవారం కూడా డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తోసిపుచ్చారు. దీంతో ఉభయసభలు గందరగోళంగా మారాయి. తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిన ఉభయసభలు.. మళ్లీ ప్రారంభమైనా ఎటువంటి మార్పులేదు. దీంతో మంగళవారం ఉదయానికి ఉభయసభలు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్షాలు.. సోమవారం ఉదయం భేటీ అయ్యాయి. పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. అదానీ గ్రూప్ సంస్థల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు విపక్షాలు డిమాండ్ చేశారు. సంయుక్త పార్లమెంటరీ కమిషన్ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ముక్తకంఠంతో నినదించారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలిపిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. "మా నోటీసులపై (పార్లమెంటులో) చర్చకు డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే అదానీ సమస్యపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాల్సిందే. అదానీ అంశాన్ని లేవనెత్తవద్దని, చర్చించవద్దని ప్రభుత్వం కోరుతోంది. దాచేందుకు ప్రయత్నిస్తోంది" అని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. 2వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపాల్సి ఉంది. అయితే, అదానీ షేర్ల పతనం అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేయడంతో గత మూడు రోజులుగా ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో సభల్లో ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలు సాగట్లేదు.
అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ గతవారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.