Live Surgery Broadcast Supreme Court Hearing : ఆస్పత్రిలో రోగులకు చేసే శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలోని నైతిక, చట్టబద్ధమైన ఉద్దేశాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందనను తెలపాలని కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య మండలి- ఎన్‌ఎంసీలను శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రసారాలకు మార్గదర్శకాలు రూపొందించాలని, అలాంటి ప్రసారాలను పరిశీలించడానికి ఒక కమిటీని కూడా నియమించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారని తెలిపింది. అయితే ఈ అంశాన్ని ఎన్ఎంసీ పరిశీలనకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Live Surgery Supreme Court : పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణ్.. ఓకే సమయంలో విరాట్ కోహ్లీనే బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ కామెంటరీ చేయడంలా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లైవ్ చూస్తున్న వారు సర్జరీ విధానం గురించి ప్రశ్నలు అడుగుతున్నారని.. దీనివల్ల రోగుల ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి శస్త్రచికిత్స ప్రత్యక్ష ప్రసారం చేసిన తర్వాత చనిపోయిన వార్తా నివేదికలను ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో దిగువ ఆర్థిక వర్గాల రోగులకు ఇలాంటి దాని కోసం ప్రేరేపిస్తారని చెప్పారు. ఇలాంటి విధానాలను నిర్వహించడానికి ప్రకటనలు (యాడ్లు), స్పాన్సర్‌షిప్‌లు ప్రధాన ప్రేరణ అని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. శంకర్‌నారాయణ్ లేవనెత్తిన అంశాలను ఎన్‌ఎంసీ పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
లైవ్ సర్జరీ బ్రాడ్కాస్ట్ అంటే..
ఇలా శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారాలు చేయడం గత కొన్నేళ్లుగా ప్రజాదరణ పొందింది. దీన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ అని అంటారు. ముఖ్యంగా దీన్ని కాన్ఫరెన్స్‌లు, లైవ్ డిజిటల్ లెర్నింగ్ వంటి విద్యాపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఈ విధానంలో.. నిపుణులైన వైద్యులు కొన్ని క్లిష్టమైన సర్జరీల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కొత్త టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ప్రేక్షకులను వివరిస్తారు. సర్జరీ చేసేటప్పుడు సర్జన్ నిర్ణయాలు తీసుకునే విధానం ఎలా ఉంటుంది? శస్త్ర చికిత్సను ఎలా డీల్ చేస్తాడు? అనే విషయాలు ప్రేక్షకులు తెలుసుకోవచ్చు. రోబోటిక్, లాప్రోస్కోపిక్/ ఎండోస్కోపిక్ వంటి శస్త్రచికిత్సల విధానాలను ఎక్కువగా లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తారు. అయితే ఈ ప్రత్యక్ష శస్త్రచికిత్స ప్రసార సమయంలో రోగి భద్రత, నైతికతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.