Hybrid immunity India: భారత జనభాలో పెద్ద సంఖ్యలో ప్రజలకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉందని, ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోవటంలో ఇదొ సానుకూల అంశమని సీనియర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ప్రస్తుతం బలమైన రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉందన్నారు దిల్లీలోని సీఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయోలజీ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనురాగ్ అగ్రవాల్.
" ప్రస్తుతం బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. దేశ జనాభాలో వీరే ఎక్కువ మంది ఉన్నారు. గతంలో కరోనా బారిన పడినప్పటికీ, టీకా ఒక్క డోసు తీసుకున్నా మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది. మూడు రకాల రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాధుల ద్వారా ఏర్పడే సాధారణ ఇమ్యూనిటీ, వ్యాక్సిన్ ఇమ్యూనిటీ, హైబ్రీడ్ ఇమ్యూనిటీ (వైరస్ బారినపడిన తర్వాత వ్యాక్సిన్ తీసుకునేవారిలో ఏర్పడే రోగనిరోధక శక్తి). భారత్‌లో ఈ మూడు రకాల ప్రజలు ఉన్నారు. ఐసీఎంఆర్ సిరోసర్వే ప్రకారం దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడ్డారు. రెండో వేవ్ తర్వాతే వ్యాక్సినేషన్ వేగం పుజుకుంది. వారికి వ్యాక్సిన్ తీసుకోక ముందే వైరస్ సోకింది. అన్ని ఇమ్యూనిటీల్లో హైబ్రీడ్ ఇమ్యూనిటీ బలమైనది."
- డాక్టర్ అనురాగ్ అగ్రవాల్, సీనియర్ శాస్త్రవేత్త
రెండో వేవ్‌కు ముందే రెండు డోసులు తీసుకున్న వారిలో ఏర్పడిన యాంటీబాడీలు తగ్గిపోయి ఉంటాయన్నారు అగ్రవాల్. వారి రోగనిరోధక శక్తిని పెంచేందుకు బూస్టర్ డోసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఇమ్యూనిటీ చాలా బలహీనంగా ఉంటుందని హెచ్చరించారు. రెండో వేవ్‌కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకుని, వైరస్ బారినపడని ఆరోగ్య సిబ్బంది వంటి వారిపై దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చూడండి:ఒమిక్రాన్‌పై టీకాలు పని చేస్తాయా? నిపుణుల మాటేంటి?