Kerala Vismaya case: కేరళలో గతేడాది సంచలనం సృష్టించిన మెడికో విస్మయ ఆత్మహత్య కేసులో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. ఆమె భర్త కిరణ్ కుమార్‌కు పదేళ్లు జైలు శిక్ష విధించింది కొల్లాంలోని న్యాయస్థానం. 22 ఏళ్ల విస్మయను అతడే కట్నం కోసం వేధించి, బలవన్మరణానికి పాల్పడేలా చేశాడని సోమవారమే నిర్ధరించింది. మంగళవారం శిక్ష ఖరారు చేసింది.
కిరణ్‌కు వేర్వేరు కేసుల్లో శిక్షలు ఇలా...
- కట్నం కోసం వేధించి మరణానికి కారణమైన కేసులో పదేళ్లు జైలు శిక్ష.
- ఆత్మహత్యకు ఉసిగొల్పిన కేసులో ఆరేళ్లు కారాగార శిక్ష.
- కట్నం కోసం వేదించిన కేసులో రెండేళ్లు శిక్ష.
- కట్నం తీసుకున్న నేరం కింద ఆరేళ్లు జైలు శిక్ష. కట్నం అడిగినందుకు ఏడాది శిక్ష.
అయితే.. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని స్పష్టం చేసింది న్యాయస్థానం. కిరణ్‌కు రూ.12,55,000 జరిమానా విధించింది. ఇందులో రూ.2లక్షలు మృతురాలి కుటుంబసభ్యులకు చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు.. కిరణ్‌కు జీవితఖైదు పడుతుందని ఆశించామని, ఈ తీర్పు నిరాశపరిచిందని చెప్పారు విస్మయ తల్లి. తండ్రి మాత్రం.. తమ కుమార్తెకు న్యాయం జరిగిందని అన్నారు.
ఏం జరిగింది?: విస్మయ.. ఆయుర్వేద వైద్య విద్యార్థి. చదువు పూర్తి కాకముందే 2019లో ఆమె తల్లిదండ్రులు.. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్ కుమార్‌తో వివాహం జరిపించారు. కట్నంగా ఆమె తల్లిదండ్రులు.. 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల కారు ఇచ్చారు. అయితే.. కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.
2021 జూన్ 20న తన బంధువులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది విస్మయ. కట్నం కోసం కిరణ్ తనను వేధిస్తున్నాడని వాపోయింది. అతడు కొట్టడం వల్ల శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. మరుసటి రోజు కొల్లాం జిల్లా సస్థంకొట్టలోని కిరణ్ ఇంట్లో శవమై కనిపించింది విస్మయ.
విస్మయ మృతికి కిరణే కారణమని ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబసభ్యులు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టగా.. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపారు. వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500పేజీలకుపైగా ఉన్న అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. మే 17న తీర్పును రిజర్వులో ఉంచింది. సోమవారం కిరణ్‌ను దోషిగా తేల్చింది. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, ప్రస్తుతం బయట తిరుగుతున్న కిరణ్‌ను.. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు.
'పాముతో భార్యను చంపి..': పాముతో కాటు వేయించి భార్యను చంపిన ఓ కేసు కూడా ఇటీవల కేరళలో చర్చనీయాంశమైంది. రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరికతో తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశాడు కొల్లాం వాసి సూరజ్. యూట్యూబ్‌లో పాముల ద్వారా ఎలా హత్య చేయాలో తెలుసుకొని పక్కా పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్‌లో దాచి ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.