కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్డౌన్ విధించేందుకు సిద్ధమైంది కేరళ ప్రభుత్వం. రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో చాలాకాలంగా ఆదివారం లాక్డౌన్ అమలవుతోంది. అయితే.. గత రెండు వారాలుగా ఈ ఆంక్షలను తొలగించింది పినరయి విజయన్ సర్కారు. ఇప్పుడు వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
కేరళలో వరుసగా మూడో రోజూ కొవిడ్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక్కరోజులోనే 32 వేల 801 కొత్త కేసులు నమోదు కాగా మహమ్మారితో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ రేటు 19 శాతాన్ని దాటింది. మొత్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య 1 లక్ష 95 వేలపైకి చేరింది.
కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ స్పందించారు. తన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తప్పు అయితే.. మరే విధానాన్ని అనుసరించాలో చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. వైద్యసాయం అందించడంలో, ఆసుపత్రుల్లో బెడ్లు లేకుండా రోగులు ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కేరళలో రెండోరోజూ 30 వేలకు పైగా కరోనా కేసులు