సాధారణంగా ఎలుకలంటే అందరికీ చిరాకే. అవి ఇంట్లో కనపడితే తరిమి తరిమిగొడతాం. 'ఎలుకల బాధ భరించలేక తగలబెట్టారట' అనే సామెత కూడా మన దగ్గర వాడుకలో ఉంది. అయితే.. కేరళకు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తి మాత్రం ఇంట్లోనే వాటిని ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. వాటి ద్వారా ఆదాయాన్నీ ఆర్జించగలుగుతున్నాడు. ఎలుకలతో డబ్బులెలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారు కదా?
అందమైన ఎలుకలు..
తెలుపు, నలుపు, బూడిద, గోధుమ వంటి వివిధ రంగుల్లో ఉండే వేయికి పైగా ఎలుకలకు కేరళ కోజికోడ్ జిల్లా వెల్లిలవాయల్లోని ఫిరోజ్ ఇంటికి వెళ్తే మనకు దర్శనమిస్తాయి. వాటిని పంజరాల్లో, ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాల్లో పెట్టి తన ఇంటిమిద్దెపైనే అయన పెంచుతున్నాడు.
ఫిరోజ్ తన విలువైన ఆస్తిగా భావించే ఈ ఎలుకలకు ఆహారంగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయాలు వంటివి అందిస్తుంటాడు. ఎవరైనా ఎలుకలు కావాలనుకునే వారికి ఆయన వాటిని విక్రయిస్తుంటాడు. తన వద్ద నుంచి ఎలుకలు కొనుగోలు చేసే వారికోసం వాటిని ఎలా పెంచాలనే దానిపై దాదాపు అరగంట పాటు శిక్షణ కూడా అందిస్తాడాయన.
అలా మొదలైంది..
విదేశాల నుంచి తన స్నేహితులు ఈ అందమైన ఎలుకలు తెచ్చివ్వగా ఫిరోజ్‌కు ఆసక్తి పెరిగింది. వీటికి మార్కెట్లో ఉండే ధర.. అతడిని తన మిద్దెపైనై ఎలుకల పెంపకం చేపట్టేలా చేసింది. ఈ ఎలుకల పెంపకంలో ఫిరోజ్‌కు తన భార్య జసీలా సహా తన కుమారులు శాహుల్ ఖాన్, శహబాస్ ఖాన్ సాయమందిస్తారు.
ఫిరోజ్ తాను ఈ ఎలుకల పెంపకాన్ని చేపట్టే విషయంలో ఇతర వ్యక్తులనెవరినీ సంప్రదించలేదు. ఎందుకంటే.. ఒకవేళ ఇందులో సత్ఫలితాలు రాకపోతే దానికి వేరే వారిని బాధ్యుల్ని తనకు ఇష్టం లేదని చెబుతాడాయన.
ఫిరోజ్ ఈ ఎలుకల పెంపకానికి ముందు పక్షులు, కుందేళ్లు, కోళ్లు వంటివాటిని పెంచారు. తన అనుభవాల్ని వివరిస్తూ ఇప్పటికే రెండు పుస్తకాలు రాశారు ఫిరోజ్. ఇప్పుడు అన్నమ్ నాల్కుమ్ ఓమానకల్ పేరుతో మూడో పుస్తకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తన అనుభవాలను ప్రజలతో పంచుకునేందుకు వీలుగా Khan's home pet పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నాడు ఫిరోజ్.
ఇదీ చూడండి: బిహార్‌లో స్కూల్ టీచర్‌గా అనుపమ!
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న బైక్ దొంగతనం- ఏమైందంటే?