మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన మంత్రివర్గం.. ఈ కేసులు అంత తీవ్రమైన నేర స్వభావం కలిగినవి కాదని పేర్కొంటూ వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
2018 -19లో శబరిమలలోకి మహిళల ప్రవేశం అంశంలో చెలరేగిన నిరసనల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దాదాపు 2వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల స్పందిస్తూ.. ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.