ఆమ్ ఆద్మీ పార్టీ.. సింపుల్‌గా 'ఆప్'.. అన్నాహజారే నేతృత్వంలోని జన్‌లోక్‌పాల్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్(kejriwal news today) 2012లో ఈ పార్టీని స్థాపించారు. వచ్చీరాగానే 2013 శాసనసభ ఎన్నికల్లో గెలిచి.. దిల్లీ పీఠం కైవసం చేసుకున్నారు. ఆప్ దూకుడుతో.. జాతీయ పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత.. 2015, 20ల్లోనూ దిల్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది ఆమ్ ఆద్మీ. మధ్యలో పలు రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లోనూ సత్తాచాటింది. 2022లో ఏకంగా 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అన్నింటా బరిలోకి దిగి గెలవాలని ఊవిళ్లూరుతోంది. విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ఇప్పటికే కార్యాచరణ సిద్ధంచేసి ఆ దిశగా దూసుకెళ్తోంది ఆప్.
ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు పర్యటిస్తూ ఉచిత విద్యుత్ వంటి హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ పోటీ చేయనున్నట్లు సంకేతాలు పార్టీ ఇచ్చింది. ఒక్క మణిపుర్పైనే స్పష్టత లేదు.
ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లోని కొన్నింట ఇప్పటికే అధికార పక్షాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన భాజపా.. గుజరాత్, ఉత్తరాఖండ్‌లో ఏకంగా ముఖ్యమంత్రులనే మార్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌కు కూడా ఇటీవల కొత్త సీఎం వచ్చారు.
ఇదే అదనుగా.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీల్లో అసమ్మతి రాగాలు, అంతర్గత కుమ్ములాటలు సహా దిల్లీలో అభివృద్ధి నమూనా తమకు ఉపకరిస్తాయని భావిస్తున్నారు కేజ్రీవాల్. అందుకే.. తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో ఆప్ పరిస్థితి, విజయావకాశాలు, ప్రచార తీరు వంటి అంశాలను పరిశీలిద్దాం..
పంజాబ్..
దిల్లీ తర్వాత.. ఆమ్ ఆద్మీ బలంగా ఉంది పంజాబ్‌లోనే(aap punjab ). 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 20 చోట్ల గెలిచి.. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ శాతం.. 38 నుంచి 28 శాతానికి తగ్గగా ఆప్ మాత్రం 23 నుంచి 35 శాతానికి పెంచుకుంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది.
ఇప్పుడు.. సీఎం మార్పు, కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఆప్‌కు ప్లస్‌గా మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దిల్లీ తరహా ఆప్ పొలిటికల్ మోడల్‌తో.. పంజాబ్‌లోనూ పాగా వేయాలని చూస్తోంది.
పంజాబ్‌లో ఇప్పటికే విద్యుత్ అస్త్రం ప్రయోగించింది ఆప్. అధికారంలోకి వస్తే మూడు భారీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు కేజ్రీవాల్.
- ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
- పెండింగ్ బిల్లులు రద్దు చేసి విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణ.
- 24 గంటలు విద్యుత్ సరఫరా.
ఇటీవల ఏబీపీ- సీ ఓటర్ సర్వే కూడా ఆమ్ ఆద్మీనే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని, అయితే హంగ్ ఏర్పడవచ్చని అంచనా వేసింది.
గోవా..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే అక్కడ పర్యటించారు. భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, తమను గెలిపిస్తే దిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
హామీల్లో కొన్ని..
- అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- గత విద్యుత్ బిల్లులన్నీ మాఫీ, రైతులకు కూడా ఉచిత విద్యుత్.
- ఇంటింటికీ ఉద్యోగం.
- రాష్ట్రంలోని ఉద్యోగాల్లో(ప్రైవేటు సహా) 80 శాతం స్థానికులకే.
- రూ. 3 వేలు నిరుద్యోగ భృతి.
- మైనింగ్, టూరిజంపై ఆధారపడిన కుటుంబాలకు అవి సాధారణ స్థితిలోకి వచ్చేవరకు నెలకు.. రూ. 5 వేలు సాయం.
గోవాలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ భాజపాకు 27, కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మేల్యులు ఉన్నారు.
సీఎం టు సీఎం..
కేజ్రీవాల్ పర్యటించిన సమయంలో.. ఆయనకే నేరుగా సవాల్ విసిరారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. మైనింగ్ కార్యకలాపాలకు పేరొందిన తన నియోజకవర్గం సాంకెలిమ్లో కేజ్రీవాల్ పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లో(aap uttarakhand) భాజపా ముఖ్యమంత్రులను మారుస్తూ వస్తోంది. ఇదే సమయంలో.. విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది ఆప్. గత జులైలో అక్కడ పర్యటించిన కేజ్రీవాల్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ఆప్ అభ్యర్థి అజయ్ కొఠియాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పంజాబ్‌లో మాదిరిగానే.. ఇక్కడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, విద్యుత్ బిల్లుల మాఫీ వంటివి చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలుండగా.. గత ఎన్నికల్లో భాజపా తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.
చాలా రాష్ట్రాల్లో ఆప్.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ఇదివరకు ఏబీపీ- సీ ఓటర్ సర్వే చెప్పిన నేపథ్యంలో గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఈ రెండూ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు విశ్లేషకులు.
ఇదీ చూడండి:- AAP: ఉత్తరాఖండ్‌లోనూ ఉచిత విద్యుత్ అస్త్రం..!
గుజరాత్..
ఆమ్ఆద్మీ.. ఫస్ట్ టార్గెట్ పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అయినా గుజరాత్‌లోనూ(gujarat aap news) గట్టిగానే ప్రయత్నిస్తోంది. అక్కడా అడపాదడపా స్థానిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ఉనికి చాటుకుంది. మొత్తం 6 పురపాలికలకు ఎన్నికలు జరగ్గా.. సూరత్‌లో 27 సీట్లను గెల్చుకుంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి భాజపాకు హెచ్చరికలు పంపింది.
గత జూన్‌లో రాష్ట్రంలో పర్యటించిన కేజ్రీవాల్.. రాష్ట్రంలో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయం ఆప్ అని అన్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. 2017 ఎన్నికల్లో భాజపా 112, కాంగ్రెస్ 65 చోట్ల విజయం సాధించాయి.
ఉత్తర్‌ప్రదేశ్..
దేశంలోని అతిపెద్ద రాష్ట్రం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఆప్ బరిలోకి దిగుతుందని గతంలోనే ప్రకటించారు కేజ్రీ.
అక్కడ భాజపానే అధికారంలో ఉన్నా.. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. అయితే.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సహా గుజరాత్ స్థానిక ఎన్నికల్లో విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో యూపీ బరిలోకి దిగనుంది ఆప్.
మరోవైపు యూపీ ఎన్నికల్లో తాము చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నామని సమాజ్‌వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. ఇక్కడ ఆప్.. ఎస్పీ లేదా ఇతర పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకొనే అవకాశముంది.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 2017 ఎన్నికల్లో భాజపా-309, ఎస్పీ-49, బీఎస్పీ-18, కాంగ్రెస్-7 సీట్లు సాధించాయి.
వినూత్న పంథా.. అభివృద్ధి మంత్రం..
దిల్లీలో అధికారంలోకి వచ్చాక ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు కేజ్రీవాల్. ఇప్పుడూ ఇదే మార్గంలో వెళుతున్నారు.
హస్తినలో ఆప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని..
- నిర్భయ ఘటన అనంతరం మహిళలకు మరింత భద్రత కల్పించాలని.. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వారికి నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది.
- దేశరాజధానిలో శబ్దకాలుష్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని.. వేడుకలు, సమావేశాల్లో నిబంధనలు ఉల్లంఘించి లౌడ్స్పీకర్లు, జనరేటర్లను ఉపయోగిస్తే రూ. లక్ష వరకు జరిమానా విధించినున్నట్లు స్పష్టం చేసింది. బాణసంచాపైనా ఆంక్షలు విధించింది.
- గాలి కాలుష్యానికి చెక్ పెట్టే దిశగా.. దేశంలోని మొట్టమొదటి స్మాగ్ టవర్‌ను దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిర్మించింది ఆప్ సర్కార్. దీనిని ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించారు.
- కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
- కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు.. చేయూతను అందించింది. పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని భరోసా ఇచ్చింది.
అయితే.. ఆప్‌లో ఎక్కడ చూసినా ఒక్క పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అదే కేజ్రీవాల్. మరి.. జాతీయ స్థాయిలో ఈ పార్టీకి అలాంటి మరో నేత లేకపోవడం ప్రతికూలాంశం. అన్ని రాష్ట్రాల్లో ఒక్కరే ప్రచారం, అభ్యర్థుల ఎంపికలు అన్నీ చేయడం కష్టతరం.
కానీ.. కేజ్రీవాల్ ఒక్కసారిగా రాజకీయాల్లో విజయవంతం కాలేదు. ఎన్నో విమర్శలు, ఎదురుదెబ్బలను ఎదుర్కొని సగర్వంగా నిలబడ్డారు. అన్నింటా ఒక్కడై.. దిల్లీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మరి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో.. ఆప్ ఎంతవరకు పోటీనిస్తుందో..!
సోనూసూద్‌తో భేటీ..
ఇటీవల ప్రముఖ నటుడు, కొవిడ్ కష్టకాలంలో దేశప్రజల వెన్నంటి నిలిచిన సోనూసూద్.. కేజ్రీవాల్‌తో(sonu sood kejriwal new) భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'దేశ్ కా మెంటర్స్' కార్యక్రమానికి ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ఆప్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఇరువురూ కలిశారు.
భేటీ జరిగిన కొద్ది రోజులకే.. ముంబయిలోని సోనూసూద్ నివాసం సహా మొత్తం 6 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. పెద్ద మొత్తంలో ఆయన పన్ను ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొన్నారు అధికారులు. తాను రూ.20 కోట్లకు పైగా పన్నుఎగవేసినట్లు ఆదాయపన్ను ప్రకటించిన నేపథ్యంలో స్పందించారు సోనూసూద్(Sonu Sood IT Raid). పన్నులకు సంబంధించిన అన్ని పత్రాలనూ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. విరాళాలను ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
కేజ్రీవాల్‌తో భేటీ అయిన కొన్ని రోజుల తర్వాత.. గుజరాత్‌లోని ఆప్ నేతలతో సమావేశమయ్యారు సోనూసూద్. అహ్మదాబాద్‌లోని సింధు భవన్ రోడ్డులో ఉన్న ఓ హోటల్లో వీరి భేటీ జరిగినట్టు సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే.. సోనూసూద్ ఆప్‌లో చేరతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. రాజకీయాలపై ఆసక్తి లేదని ఇప్పటికే అనేకమార్లు ప్రకటించారు సోనూ. మరి కేజ్రీ-సోనూ బంధం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇదీ చూడండి:- ప్రజాప్రభుత్వం నామమాత్రం- దిల్లీలో ఎల్జీనే కీలకం