ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న క్రీడల్లో క్రికెట్ ఒకటి. అందులోనూ భారత్‌లో ఈ గేమ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆటగాళ్లు బ్యాట్లు ఝుళిపిస్తూ గ్రౌండ్లో సిక్స్‌లు, ఫోర్లు బాదుతుంటే స్టేడియం అంతా ఈలలు, చప్పట్లతో దద్దరిల్లుతుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లు వాడిన బ్యాట్ గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. అలా.. క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి విల్లో బ్యాట్లు. ఈ రకం బ్యాట్లు ఇంగ్లాండ్ తర్వాత ఎక్కువగా భారత్‌లోనే ఉత్పత్తి అవుతాయి.
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కశ్మీరీ విల్లో బ్యాట్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్నే అందిపుచ్చుకున్నారు జమ్ముకశ్మీర్‌కు చెందిన ఫజల్ కబీర్. గ్రేట్స్పోర్ట్స్ సంస్థకు చెందిన బ్యాట్లను ఆటగాళ్లు ఈ ప్రపంచకప్‌లో వినియోగించేలా కృషి చేశారు. తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ఏడేళ్లు పట్టిందని తెలిపారు.
"గత ఏడేళ్లగా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఇతర దేశాల్లోనూ మా ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే మార్కెటింగ్ అవసరం. ఇప్పుడు మేము స్పాన్సర్ చేసిన దేశాల జట్లు ఈ కశ్మీరీ విల్లో బ్యాట్‌తో ఆడడం పట్ల సంతోషంగా ఉంది. ఒకప్పుడు మా ఉత్పత్తులను తిరస్కరించిన వాళ్లే ఇప్పుడు మళ్లీ మమ్మల్ని సంప్రదిస్తున్నారు."
-ఫజల్ కబీర్, గ్రేట్స్పోర్ట్స్ యజమాని
ప్రస్తుతం తమ కశ్మీరీ విల్లో బ్యాట్లను ఒమన్ జట్టు బ్యాట్స్‌మెన్ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.
1974లో ఫజల్ తండ్రి ఈ బ్యాట్ తయారీ పరిశ్రమను స్థాపించారు.
ఇదీ చూడండి : చైనా కుటిల నీతి.. తిప్పికొట్టేందుకు భారత్ వ్యూహ రచన