Robots as Teachers: ఈ డిజిటల్ యుగంలో.. విద్యార్థులకు శ్రమ తెలియకుండా పాఠాలు చెప్పి వారి సందేహాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేసింది. రోబో సినిమాలో చిట్టీలాగ.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడమే కాక వారు అడిగిన డౌట్లను టక్కున క్లియర్ చేసేందుకు ఓ రోబోను తీసుకొచ్చింది. ఈగల్ పేరుతో ఈ రోబోను బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టింది. ఈ రోబోను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ బుధవారం ఆవిష్కరించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న క్రమంలో స్కూళ్లలో ఈ తరహా రోబోలు ప్రవేశపెట్టడం చాలా అవసరమని మంత్రి అశ్వత్ నారాయణ పేర్కొన్నారు. రోబో అనేది టీచర్లకు ప్రత్యామ్నాయం కాదని అది వారికి పనికి సహకరించేందుకేనని చెప్పిన మంత్రి.. ఈ రోబోల ద్వారా బోధనలో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలపైన కన్నడ, ఇంగ్లీషు భాషల్లో పాఠాలు చెప్తూ.. అడిగిన సందేహానికి వెంటనే సమాధానం చెప్తున్న రోబోను చూసి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోబోతో తాము మరింత సులువుగా పాఠాలు వినవచ్చని విద్యార్థులు ఉత్సాహపడుతున్నారు.
ఈ ఈగల్ రోబోను త్వరలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముందు కూడా ప్రదర్శించనున్నారు. ఈ రోబోలను మల్లేశ్వరంలోని ఇతర ప్రభుత్వ పాఠశాల్లో కూడా ప్రవేశపెట్టాలని తాము భావిస్తున్నామని.. కాబట్టి ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి తేవాలని ఆశిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యా ప్రమాణాల్లో మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇదీ చూడండి : ఆమెకు 67.. అతడి వయసు 28.. నోటరీ చేయించిమరీ సహజీవనం!