కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి వ్యవసాయం అంటే అమితాసక్తి. తీరిక సమయాల్లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. ఎరువులు చల్లుతూ వ్యవసాయ క్షేత్రంలో గడిపేందుకే ఇష్టపడుతుంటారు. ఈ మధ్య సాగుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఆయన.. ఇజ్రాయెల్ వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టారు. బీదడి జిల్లా కేటుగనహళ్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ సరికొత్త సాగు చేస్తున్నారు కుమారస్వామి. అత్యాధునిక పద్ధతుల్లో పశువులు, కోళ్లు, చేపలు, పలు జాతులకు చెందిన గొర్రెలను పెంచుతున్నారు. చేపల పెంపకం కోసం ఆయన.. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకమైన పద్ధతిలో... చెరువులను తవ్వించారు.
ఏంటీ ఇజ్రాయెల్ మోడల్..?
అతి తక్కువ విస్తీర్ణంలో వివిధ ఉద్యాన పంటలను పండించే విధానాన్నే ఇజ్రాయెల్ అగ్రికల్చర్ టెక్నాలజీగా పరిగణిస్తున్నారు. సాగుతో పాటు.. వ్యవసాయం, చేపలు, గొర్రెలు, వివిధ జాతి కోళ్లను సమీకృతంగా పెంచవచ్చు. మామూలు పద్ధతిలో.. ఎకరా భూమిలో 40 మామిడి మొక్కలు మాత్రమే నాటే అవకాశం ఉండగా.. ఈ నమూనాలో ఒక ఎకరాకు 250 కంటే ఎక్కువ మొక్కలను నాటవచ్చు.
రైతుల ఆసక్తి..
కుమారస్వామి ప్రారంభించిన ఇజ్రాయెల్ మోడల్ ఫార్మింగ్‌పై స్థానిక రైతులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యానవన శాఖ సూచనలతో.. ఇప్పటికే రామనగర జిల్లాలోని కూటగల్, కైలాంచా ప్రాంతంలో మామిడి మొక్కలను నాటారు.
ఇజ్రాయెల్ విధానంలో సాగు చేపడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మామిడి పంట.. మొదటి కోతకే ఒక్కో చెట్టుకు 25 కిలోల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ మేరకు.. ఎకరాకు సుమారు 5 నుంచి 8 టన్నుల వరకు మామిడి దిగుబడి సాధించవచ్చని వివరిస్తున్నారు.
ఇవీ చదవండి: