దేశంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం.. ముఖ గుర్తింపు సాంకేతికతను (ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ) ఉపయోగించనుంది. మే 10వ తేదీన జరగనునన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో ఈ ప్రయోగం చేపట్టనుంది.
ఈ టెక్నాలజీని బెంగళూరు అంతా కాకుండా కేవలం ఒక్క పోలింగ్ బూత్‌లోనే ఉపయోగించనుంది ఎన్నికల సంఘం. ప్యాలెస్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ రామ్‌నారాయణ్ చెల్లారం కళాశాల రూమ్ నెం.2లో ఈ సరికొత్త సాంకేతికతను పరీక్షించనుంది.
ఇదెలా పని చేస్తుంది?
- ముందుగా ఓటర్లు తమ మొబైల్లో చునావన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఓటర్ ఐడీ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- తమ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ఓటర్.. తమ సెల్ఫీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- పోలింగ్ బూత్‌కు వెళ్లాక అక్కడ వెరిఫికేషన్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ స్కానింగ్ చేయించుకోవాలి.
- ఎన్నికల కమిషన్ డేటాబేస్‌తో ఓటర్ ఫొటో సరిపడితే ఓటు వేసేయొచ్చు.
- ఎలాంటి పత్రాలను చూపించకుండా ఓటు వేయొచ్చు.
'ఓటర్లు వేచి ఉండే సమయం తగ్గనుంది'
సాధారణంగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో వేచి ఉండాలి. అక్కడ ఉన్న సిబ్బంది.. ప్రతి ఒక్కరి ఓటర్ ఐడీని సరిచూశాకే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇందుకు కాస్త సమయం పడుతుంది. అయితే.. చునావన యాప్ ద్వారా అమలయ్యే ఈ కొత్త విధానం వల్ల పోలింగ్ బూత్‌లలో ఓటర్లు వేచి ఉండే సమయం తగ్గుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. బోగస్ ఓట్లు, ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో యాప్ పనితీరు ఆధారంగా.. భవిష్యత్‌లో మిగిలిన చోట్ల కూడా ఉపయోగించే అంశాన్ని పరిశీలించనున్నారు.
Karnataka Assembly Elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మే 10వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు జేడీఎస్ సర్వశక్తలూ ఒడ్డాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరుగుతూనే.. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు వర్షం కురిపించాయి.
ఒకే సీటు.. ఒకే పేరు.. ఇద్దరికి మించి అభ్యర్థులు!
త్రిముఖ పోరు నడుస్తున్న కర్ణాటక ఎన్నికల్లో ఒకే పేరుతో పలువురు అభ్యర్థులు బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న పలు నియోజకవర్గాల్లో.. అదే పేరుతో ఉన్న కొందరు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమవుతోంది. ఇలా నామినేషన్ వేయడానికి కారణమేంటి? దీని వెనుక ప్రధాన పార్టీల హస్తం ఉందా? ఉంటే.. దాని వల్ల వచ్చే లాభమేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకొని 38 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని కాషాయదళం భావిస్తోంది. బీజేపీని గద్దె దించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తలుపు తెరవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక వేళ హంగ్ ఏర్పడితే మరోసారి కింగ్ మేకర్ అవ్వాలని జేడీఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మే13న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.