కర్ణాటకలో రిజర్వుడ్ స్థానాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. మొత్తం 224 స్థానాలకు 51 సీట్లు రిజర్వు కాగా.. ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 కేటాయించారు. ఆయా స్థానాలు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో.. మెజార్టీ రిజర్వుడ్ సీట్లు గెల్చుకున్న పార్టీనే అధికారం చేపట్టింది. ఫలితంగా.. ఆయా చోట్ల గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51 రిజర్వు స్థానాల్లో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నడిచింది. 2008లో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ 29 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది.ఆ సమయంలో జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013లో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్.. 51 సీట్లకు 27 కైవసం చేసుకోవడం సహా అధికార పగ్గాలు చేపట్టింది. ఆ సమయంలో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ స్థానాలు 19కి పడిపోగా.. బీజేపీ 23 చోట్ల జయభేరి మోగించింది. ఎన్నికల అనంతర పొత్తులో భాగంగా.. కాంగ్రెస్, జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. అది ఎక్కువ కాలం నిలవలేదు. 2021లో తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
తాజా ఎన్నికల్లో మెజార్టీ రిజర్వు స్థానాలను దక్కించుకోవడం సహా... అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దళితులు, గిరిజనులు బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. బీజేపీ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానం.. సమాజంలో చీలిక తీసుకొచ్చేలా ఉందని ఆయన మండిపడ్డారు. మరోవైపు.. రిజర్వేషన్ల వల్ల కీలక వర్గాలైన లింగాయత్‌లు, వక్కళిగలు తమవైపే ఉన్నారని బీజేపీ ఎస్సీ మోర్చా నేత చలవాది నారాయణస్వామి పేర్కొన్నారు. బీజేపీ సర్కారుపై వ్యతిరేకత అనేది.. విపక్షాల మదిలో మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వుడ్ స్థానాల్లో.. 2008 కంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంటామని తెలిపారు.
రిజర్వుడు స్థానాల్లో అన్ని పార్టీలూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులనే నిలబెట్టాల్సి ఉన్నందున.. వారి ఓట్లు చీలిపోతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఆయాచోట్ల.. మిగతా వర్గాల వారే కీలకంగా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా మంది ప్రజలు.. పార్టీని చూసే ఓట్లు వేస్తున్నారని, కుల, మతాల ప్రభావం తక్కువేనని జేడీఎస్ నేతలు అంటున్నారు. కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు ఉంటే.. తప్పకుండా విజయం సాధిస్తారని చెబుతున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఎంపికపైనా ప్రధాన పార్టీలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నాయి. బీజేపీ ధనవంతులు, గెలుపు గుర్రాలనే నమ్ముకుందని, తమ పార్టీ మాత్రం బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని.. కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వాదనను బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు.
రెబల్స్ బెడద
కొన్ని రిజర్వుడు స్థానాల్లో.. కాంగ్రెస్‌కు తిరుగుబాటుదారుల బెడద ఎదురయ్యేలా కనిపిస్తోంది. బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోని దేవనహళ్లి స్థానం.. ఎస్సీకి రిజర్వు కాగా, అక్కడ కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను కాంగ్రెస్ ఎంపిక చేసింది. అయితే కోలార్ జిల్లాకు చెందిన మునియప్పకు ఈ సీటు కేటాయించడం పట్ల.. స్థానిక నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీ.శ్రీనివాస్ అనే నాయకుడు మూడేళ్లుగా.. ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నందున.. దేవనహళ్లి సీటు విషయంలో అధిష్ఠానం పునరాలోచన చేయాలని నేతలు కోరుతున్నారు. చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం.. బీజేపీ నుంచి రానున్న ఎమ్మెల్యే హనుమంతప్పను నిలబెట్టాలని చూస్తుండగా.. స్థానిక నేతలు మాత్రం బంగారు హనమంతకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు గత వారం బెంగళూరులో ధర్నా కూడా చేశారు.