'చక్రం' ఆవిష్కరణ తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. జనసమూహం అందుకు తగినట్లుగానే తమ జీవితాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మోటారు వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా పర్యావరణం దెబ్బతినడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రకృతిపై మమకారం పెంచుకున్న ఓ అధ్యాపకుడు.. పర్యావరణ హితం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే మోటారు వాహనాల జోలికి పోకుండా.. 20 ఏళ్లుగా సైకిల్‌నే వాడుతున్నారు. ఆయనొక్కరే కాదండోయ్? కుటుంబం మొత్తం సైకిల్‌నే వినియోగిస్తోంది.
కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని తరళబాలు నగరానికి చెందిన డాక్టర్ హెచ్.కె.ఎస్ స్వామి. సైకిల్ వినియోగాన్ని మరింత పెంచి.. 'ఇంధన రహిత భారత్' గురించి ఎన్నో కలలు కంటున్నారు స్వామి.
ఇద్దరు కూతుర్లకూ భాగస్వామ్యం
ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న స్వామి.. తన వృత్తికి వీడ్కోలు పలికి ప్రకృతిపై అవగాహన కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఆయన ఇద్దరు కుమార్తెలు.. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. వారు ఎక్కడికెళ్లినా సైకిల్‌నే ఉపయోగిస్తారు. తమ స్నేహితులకు, ఇతరులకు పర్యావరణం గొప్పతనాన్ని గురించి తెలిపేందుకు ఇలా సైకిల్‌పై తిరుగుతూ.. ఆ అమ్మాయిలు తమవంతు కృషి చేస్తున్నారు.
ఇలా ప్రకృతిపై ప్రేమతో.. గాంధీ సూత్రాన్ని అనుసరిస్తూ 30ఏళ్లుగా స్వామి కుటుంబం ఖాదీ వస్త్రాలనే ఉపయోగిస్తోంది. పర్యావరణ హితం కోసం చేతితో రాసే బిల్బోర్డ్లనూ తయారు చేశారు స్వామి.
కాగితాలపై సందేశాలతో..
పర్యావరణంతో పాటు ఇటీవల ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు తనతో పాటు తన కుమార్తెలిద్దరిని భాగస్వామ్యం చేశారు స్వామి. వీరు ఇతర ప్రాంతాలకు సైకిల్‌పై వెళ్లి ప్రకృతి గురించి ప్రజలకు వివరిస్తారు. పర్యావరణ ప్రాముఖ్యతను చాటేందుకు కాగితాలపై చక్కని సందేశాలు రాసి అతికిస్తారు.
ఇలా స్వామి కృషిని అనేక మంది మెచ్చుకోగా.. మరికొందరు వారి ఖాళీ సమయాల్లో ఆయనకు సాయమందిస్తున్నారు.
ఇదీ చదవండి: పాతికేళ్లుగా పాములతో సావాసం చేస్తోన్న 'బినీష్'