dk shivakumar fires on bjp : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. రెండు నెలలకే దాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఏం జరుగుతుందో చూద్దామని.. తమ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉందని డీకే శివ కుమార్ తెలిపారు. అది బీజేపీ వ్యూహమని.. బెంగళూరులో కాకుండా బయట ఈ కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వస్తున్న వార్తలపై.. విలేకరులు అడిగిన ప్రశ్నకు డీకే ఈ మేరకు స్పందించారు.
డీకే వ్యాఖ్యలను సమర్ధించిన మరో మంత్రి
శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ సైతం సమర్థించారు. బీజేపీ ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టిందని.. అందుకే తాము కూడా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీకి మంచి, చెడు అనే తేడా ఏమీ లేదన్నారు. వాళ్లు చేస్తున్న అప్రజాస్వామిక పోకడలు అందరికి తెలిసినవేనని వ్యాఖ్యానించారు. డీకే శివ కుమార్‌కు దీనిపై మరింత సమాచారం ఉండి ఉండొచ్చని బైరెగౌడ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. ప్రభుత్వాలను కూల్చడంలో అది ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆయన ఆరోపించారు.
135 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్..
Karnataka Election Results : ఈ ఏడాది మే నెలలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.