కర్ణాటకలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా ప్రచారమైన ఊహాగానాలను నిజం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
అనంతరం రాజ్‌భవన్ బయట విలేకరులతో మాట్లాడిన యడియూరప్ప.. రాజీనామా చేయాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టినా.. వారితో కలిసి పనిచేస్తామని అన్నారు. రెండు రోజుల క్రితమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"ఎవరూ నాపై ఒత్తిడి చేయలేదు. వేరే వ్యక్తి ఎవరైనా పదవి చేపట్టాలన్న ఉద్దేశంతో.. నా సొంతంగానే రాజీనామా చేశా. రెండు రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా. గవర్నర్ నా రాజీనామాను ఆమోదించారు. తర్వాత జరిగే ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తా. సీఎం పదవికి ఎవరి పేరునూ సూచించలేదు. భాజపా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తే వారి నేతృత్వంలో పనిచేస్తాం. నేను, నా మద్దతుదారులు వంద శాతం సహకరిస్తాం. అసంతృప్తి అన్న విషయం గురించి మాట్లాడాల్సిన పని లేదు. రెండేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు."
-బీఎస్ యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
యడ్డీ భావోద్వేగం
అంతకుముందు.. రెండేళ్ల పాలనను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో యడియూరప్ప భావోద్వేగానికి లోనయ్యారు. రెండేళ్లుగా ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ కోసం ఒంటరిగా పోరాడినట్లు తెలిపారు.
"భాజపా విధానాల ప్రకారం 75 ఏళ్లు దాటిన ఎవరైనా పదవిలో ఉండటానికి వీలు లేదు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా.. తమ ప్రేమాభిమానాలతో నన్ను సీఎంగా కొనసాగించారు. రాష్ట్రంలో భాజపా ఉనికిలో లేనప్పుడు.. నేను ఒంటరిగా పోరాడి పార్టీని పోటీలోకి తెచ్చాను. పార్టీ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డా. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. జన్‌సంఘ్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు, దళితుల కోసం మాట్లాడాను. నా పని పట్ల సంతృప్తిగానే ఉన్నా. వాజ్‌పేయీ నన్ను పిలిచి కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే తిరస్కరించాను. కర్ణాటకవ్యాప్తంగా తిరిగి రెండు సీట్లు ఉన్న పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చా. ప్రజలు మమ్మల్ని విస్మరించలేదు. లక్షలాది కార్యకర్తల శ్రమకు గుర్తింపుగా అధికారాన్ని కట్టబెట్టారు."
-బీఎస్ యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
యడియూరప్ప రాజీనామా విషయంపై చాలా కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని యడ్డీ స్పష్టం చేస్తూ వచ్చారు. హైకమాండ్ ఆదేశాలతోనే పదవిలో నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: