కర్ణాటక మైసూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెళ్లికుమారుడితో పాటు మరో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులను టి నరశిపుర తాలుకాలోని ఇందిరా కాలనీకి చెందిన ఇమ్రాన్ పాషా(30), యాస్మిన్(28), అఘనాన్(2)గా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఇందిరా కాలనీకి చెందిన ఇమ్రాన్ పాషాకు ఈ నెల 28న వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం బట్టలు కొనడానికి బంధువులతో కలిసి ఆటోలో వెళ్తున్నారు. అయితే టి.నరశిపుర తాలూకాలోని వరకోడు గ్రామంలోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో ఓ మలుపు వద్ద ఆటోను బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ఉన్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఉగ్ర ఏరివేత- ఇద్దరు ముష్కరులు హతం!