MP Avinash Letter to CBI : మాజీమంత్రి వై.ఎస్.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 19న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా... పులివెందుల నియోజకవర్గంలో ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరు కాలేనని సీబీఐకి విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల సమయం కావాలని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఆయన లేఖపై మధ్యాహ్నం స్పందించిన సీబీఐ అధికారులు... వాట్సప్ ద్వారా అవినాష్ రెడ్డికి మరో నోటీసు అందజేశారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు వస్తుండగా.. మార్గమధ్యలోనే వాట్సప్ ద్వారా నోటీసు అందుకున్న అవినాష్.. ఈనెల 19న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. రేపు పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ... ఇప్పటికే పలుమార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది. గత 20 రోజులుగా విచారణ లేకపోగా.. తాజాగా నోటీసులిచ్చి విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర, ప్రమేయంపై ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కౌంటర్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో భారీ కుట్రకు అవినాష్, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి పాల్పడ్డారని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: