Kaali Controversy: దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా డాక్యుమెంటరీ 'కాళీ'కి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసి దుమారం రేపారు. ఆ పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. మతపరమైన మనోభావాలను లీనా దెబ్బతీశారని, ఆమెను అరెస్టు చేయాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం 'గో మహాసభ' ప్రతినిధులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దర్శకురాలిపై కేసు నమోదైంది. తాజాగా 'కాళీ' డాక్యుమెంటరీ నిర్మాతలపైనా దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, నేరపూరిత కుట్ర, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం వంటి అభియోగాలను మోపారు.
కాళీ పోస్టర్ తీవ్ర దుమారం రేపడం వల్ల 'అరెస్ట్ లీనా మణిమేగలై' హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే లీనా ట్విటర్‌లో స్పందించారు. 'నేను నమ్మిన విషయాన్ని బతికున్నంతవరకూ నిర్భయంగా చెబుతా. నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా, అందుకు సిద్ధమే' అని పేర్కొన్నారు. ఈ చిత్రం టొరంటో అగాఖాన్ మ్యూజియంలోని రిథమ్స్ ఆఫ్ కెనడా విభాగానికి చెందినదని, పోస్టరులోని సందర్భాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను పూర్తిగా చూడాలని కోరారు. 'ఈ చిత్రాన్ని చూశాక లవ్ యూ లీనా మణిమేగలై అని మీరే అంటారు' అని ఆమె పేర్కొన్నారు. మధురైలో జన్మించిన లీనా ప్రస్తుతం టొరంటోలో ఉంటున్నారు.
రంగంలోకి భారత హైకమిషన్
కెనడాలోని హిందూ సమాజం నుంచి విజ్ఞప్తులు రావడం వల్ల అక్కడి భారత హైకమిషన్ సోమవారం 'కాళీ' పోస్టర్‌పై ఓ ప్రకటన విడుదల చేసింది. మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ఉన్న ఆ పోస్టర్‌ను తొలగించాలంటూ కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతురు.. వైమానిక దళ చరిత్రలోనే..