బెంగాలీలు ఎవరి బెదిరింపులకూ వెరవరని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ, ఒకప్పటి నటి జయాబచ్చన్ వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. భాజపాపై విమర్శలు గుప్పించిన ఆమె.. మమతా బెనర్జీ పోరాటపటిమ గురించి కొనియాడారు.
టీఎంసీ అధినేత్రి ఎన్నో దాడులు, ఒడుదొడుకులను ఒంటిచేత్తో ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోరాడుతున్నారని, ఆమె అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానమని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఆమె తలను, కాలిని గాయపరిచినా.. బంగాల్‌ను ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముందుకుసాగుతున్న ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేమన్నారు.
వారిద్దరికి పోలికే లేదు..
అయితే బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. మొదటి రెండు దఫా ఎన్నికల్లోనే ఓటర్లు తమపార్టీవైపు మొగ్గుచూపారని విశ్వాసం వ్యక్తం చేశారు. మిథున్ చక్రవర్తికి, జయా బచ్చన్‌కి ఎలాంటి పోలిక లేదని అన్నారు. 'ఒకప్పుడు బచ్చన్ వెండితెర ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నారు. నిజానికి బంగాల్లో టీఎంసీకి మద్దతుగా ప్రచారం చేయడానికి ఎవరూ ఇష్టపట్లేదు. బచ్చన్‌ను ఎవరో ఒప్పించి తీసుకువచ్చారు.' అని అన్నారు.
ఇదీ చదవండి: 'ఒంటికాలుతో బంగాల్లో విజయం- రెండు కాళ్లతో దిల్లీపై గురి'