Jatti Kalaga In Karnataka : కర్ణాటకలో ప్రత్యేక పోటీలు అనగానే మనకు కంబళ వేడుకలే గుర్తొస్తాయి. దున్నలకు తాళ్లు కట్టి బురదలో పరిగెత్తించుకుంటూ తీసుకెళ్లే ఈ కంబళ పోటీలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఆ రాష్ట్రంలో మరో పోటీకి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ప్రత్యర్థి రక్తం చిందించేలా మల్ల యుద్ధం చేసే 'జట్టి కలగ' పోటీలకు కర్ణాటక పెట్టింది పేరు. వజ్రముష్టి కలగ అని కూడా పిలిచే ఈ పోటీలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.
Mysore Dasara Festival 2023 : ప్రపంచంలో రక్తపాతం జరిగే సిసలైన పోరాటాల్లో వజ్రముష్టి కలగకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతంలో శ్రీకృష్ణుడి కాలం నాటి నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారని ప్రతీతి. ఈ పోటీల్లో పాల్గొనే రెజ్లర్లను జట్టీలని పిలుస్తుంటారు. వీరు కుస్తీ పట్టే ప్రదేశాన్ని 'కన్నడి తొట్టి' అని అంటుంటారు. ఈ జెట్టీలను మైసూరు రాజులు పోషిస్తుండేవారు. వడియార్ రాజవంశ పాలనలో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతుండేవి. నవరాత్రుల్లో చివరిదైన విజయదశమి రోజున ఈ పోటీలు జరుపుతారు. యదువంశ రాజులు ఏవైనా విజయాలు సాధించిన తర్వాత నిర్వహించే ఊరేగింపుల సమయంలోనూ వజ్రముష్టి కలగను నిర్వహిస్తుంటారు.
మల్లయుద్ధాన్ని తలపించే ఈ క్రీడలో.. తమ ప్రత్యర్థులను రక్తం చిందించి ఓడించాల్సి ఉంటుంది. పోటీలు నిర్వహించే ముందు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. దసరా జంబూ సవారీ నిర్వహిస్తారు. ఇప్పటికీ మైసూరు రాజవంశం ఈ సంప్రదాయాలను పాటిస్తూ వస్తోంది. జట్టి కుటుంబీకులు, వంశస్థులు ఈ పోటీల్లో భాగమవుతారు. ఇద్దరేసి చొప్పున ఈ పోటీలో తలపడుతుంటారు. గుండు గీయించుకొని, వేళ్లలో ఇమిడిపోయే చిన్నపాటి ఇనుప ఆయుధాన్ని చేతికి ధరించి ముష్టి యుద్ధం చేస్తారు. ఎవరికి ముందుగా రక్తస్రావం అవుతుందో వారు ఓడినట్లు లెక్క!
ఎలా జట్టు కడతారు?
ప్రస్తుతం మైసూరు, చామరాజనగర్, చన్నపట్టణం, బెంగళూరు ప్రాంతాల్లో జట్టీలు నివసిస్తున్నారు. ఒక్కో నగరం నుంచి ఇద్దరేసి చొప్పున జట్టీలను ఎంపిక చేసి పోటీలకు పంపుతుంటారు. అందులో నుంచి ఇద్దరేసి చొప్పున ఉండే రెండు జట్లను ఎంపిక చేస్తారు. రెండు జట్టీల బృందాలను స్టాండ్‌బైలుగా ఉంచుతారు. మైసూరు రాజు, రాణి ముందు వారిని హాజరుపరుస్తారు. వారి అనుమతితో పోటీలు జరుగుతుంటాయి. రాచరిక సంప్రదాయాలతో ఈ పోటీలు జరుగుతుంటాయి. ఒకసారి పోటీ పడిన జట్టీలు.. వచ్చే ఏడాది పోటీ పడేందుకు అనుమతి ఇవ్వరు. ఎంపికైన నాలుగు బృందాలకు 45 రోజుల ముందుగానే ప్రత్యేక శిక్షణ ప్రారంభమవుతుంది. వీరికి పూర్తిగా శాఖాహారాన్నే అందిస్తారు.
రాజకుటుంబం ఆశీర్వాదంతో..
"రాజుకు నమస్కరించి.. పోటీలు ప్రారంభిస్తారు జట్టీలు. జట్టీలకు రాజ కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పటికీ ఈ పోటీలు జరుగుతుండటం చాలా సంతోషాన్ని ఇస్తోంది" అని ఉస్తాద్ మాధవ్ జట్టి చెప్పుకొచ్చారు.
కంబళ శ్రీనివాస ప్రతిభకు ప్రపంచం సలాం!
కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!