ఖలిస్థాన్ ఉద్యమాన్ని కశ్మీర్ ఉగ్రవాదంతో ముడిపెట్టేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ప్రయత్నాలు చేస్తోందని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, ఆయుధాలతో ఐదుగురు ఉగ్ర అనుమానితులు సోమవారం పట్టుబడటం ఈ విషయాన్ని సూచిస్తోందని అన్నారు.
డబ్బుల కోసం ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారని దిల్లీ ప్రత్యేక సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని చెప్పారు.
"మాకు అందిన సమాచారాన్ని బట్టి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. అందులో ఇద్దరు పంజాబ్, ముగ్గురు కశ్మీర్‌కు చెందినవారు. మూడు పిస్తోళ్లు, రెండు కిలోల హెరాయిన్, రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నాం. ఖలిస్థాన్ ఉద్యమాన్ని కశ్మీర్ ఉగ్రవాదంతో ఐఎస్ఐ ఎలా ముడిపెడుతుందో ఈ అరెస్టు సూచిస్తోంది. నోట్ల రద్దు తర్వాత నకిలీ కరెన్సీ సరఫరా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌ను ఉపయోగించి ఉగ్రవాదులు సొమ్ము చేసుకుంటున్నారు. హత్యలు చేసేందుకు గ్యాంగ్స్టర్లను ఉపయోగిస్తున్నారు."
-ప్రమోద్ కుష్వాహా, దిల్లీ ప్రత్యేక సెల్ డీసీపీ
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ హత్యకు.. అరెస్టైన వారిలో ఇద్దరికి సంబంధం ఉందని తెలిపారు కుష్వాహా.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడారు బల్విందర్ సింగ్. పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు.
"అరెస్టైన వారిలో పంజాబ్‌కు చెందిన ఇద్దరికి బల్విందర్ సింగ్ హత్యకు సంబంధం ఉంది. గుర్జీత్ సింగ్, సుఖ్దీప్ సింగ్ పలు క్రిమినల్ కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐతో ముడిపడిన గ్యాంగ్‌స్టర్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయి."
-ప్రమోద్ కుష్వాహా, దిల్లీ ప్రత్యేక సెల్ డీసీపీ
కశ్మీర్‌కు చెందిన ముగ్గురికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు కుష్వాహా. షబ్బీర్ అహ్మద్, ఆయుబ్ పఠాన్, రియాజ్.. ఆ ఉగ్ర సంస్థకు ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు.