భారత్-చైనా సరిహద్దు ప్రాంతం ఉత్తరాఖండ్ పిథోరగఢ్ జిల్లాలో నిత్యవసరాల ధరలు గత రికార్డులను చెరిపేశాయి. హిమాలయ పర్వతం సమీపంలోని పలు గ్రామాల్లో కేజీ ఉప్పును రూ.130 వరకు విక్రయిస్తున్నారు. వంటనూనె ధర రూ.275-300 మధ్య ఉంది. కేజీ ఎర్ర పప్పు ధర రూ.200, కేజీ బియ్యం రూ.150, ఉల్లిపాయ కిలో రూ.125, చక్కెర, గోధుమ పిండి కేజీ రూ.150కి చేరింది. ధరలు సాధారణం కంటే 8 రెట్లు ఎక్కువ కావడం వల్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
హిమాలయాల సమీపంలోని మునిసియారి, దార్మా, ధార్చులా వ్యాస్ వ్యాలీ పర్వత ప్రాంతాలకు వెళ్లే రోడ్లు పాడైపోయి రాకపోకలు నిలిచిపోవడం వల్లే ఆయా గ్రామాల ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది.
ఎమ్మెల్యే డిమాండ్..
ఈ అధిక ధరలను ప్రజలు భరించలేరని, ప్రభుత్వమే ముందుకు వచ్చి సాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే హరీశ్ ధామీ డిమాండ్ చేశారు. ఇక్కడికి నిత్యావసరాలను ప్రభుత్వమే సరఫరా చేసి, చౌక ధరల దుకాణాల్లో విక్రయిస్తే గ్రామస్థులకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
పరిస్థితి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డా.ఆశిశ్ చౌహాన్.. కొండ ప్రాంతాల్లోని గ్రామాలకు నిత్యావసరాలను సరఫరా చేయాలని డిప్యూటీ కలెక్టర్, జిల్లా సరఫరా అధికారులకు ఆదేశాలిచ్చారు. సరకులను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ఈ గ్రామాల ప్రజలను సిరిహద్దు మొదటి సంరక్షులు అని కూడా పిలుస్తుంటారు. వేసవి కాలంలో వీరంతా వ్యవసాయం, పశువుల సంరక్షణ కోసం కొండపైకి వెళ్లి 6 నెలల పాటు అక్కడే ఉంటారు. శీతాకాలంలో హిమపాతం బారిన పడకుండా ఉండేందుకు కిందకు వస్తారు. అయితే వర్షాల కారణంగా ఇక్కడి రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు, సరకులు సరఫరా చేసేందుకు రవాణా సౌకర్యం లేక ధరలు భారీగా పెరిగాయి.
ప్రభుత్వ అధికారులు వీలైనంత త్వరగా తమ సమస్యలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేకపోతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ