జమ్ము కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను తెలుసుకున్న ఆర్మీ.. సమర్థంగా వారిని అడ్డుకుంది. ముష్కరుల ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన.
'కొంత మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద చొరబాటుకు యత్నించారు. వారంతా భారీ ఆయుధ సామగ్రితో సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి అప్రమత్తమయ్యాం' అని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు.
అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో విజయవంతంగా ఉగ్రవాదులను తరిమికొట్టగలిగారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంతకుముందు కూడా సెప్టెంబర్ 18న కొంత మంది ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో చొరబాటుకు విఫలయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌తో ఉగ్రమూకలు తోక ముడిచాయి.
ఇదీ చదవండి: kakori conspiracy: స్వాతంత్య్రోద్యమంలో విస్మృత వీరనారి.. రాజ్‌కుమారి