Indian Cough Syrup Gambia : హరియాణా నుంచి గాంబియాకు ఎగుమతి అయిన దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. గాంబియాలో 70 మంది చిన్నారుల మరణాలకు ఈ మందులే కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. అయితే ఔషధాలను సరఫరా చేసిన రెండు భారతీయ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యూఎస్ న్యాయ సంస్థను సంప్రదిస్తున్నట్లు గాంబియా ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది.
Gambia Cough Syrup Deaths : గతేడాది గాంబియాలో మూత్రపిండాల వైఫల్యంతో సుమారు 70 మంది చిన్నారులు మరణించారు. భారత్‌లో తయారైన కలుషిత ఔషధాల వల్లే ఈ మరణాలు సంభవించాయనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా గాంబియాకు సరఫరా చేస్తున్న దగ్గు మందుల్లో నాణ్యత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం హెచ్చరించింది. మార్చిలో యూఎస్ సీడీసీ, గాంబియన్ ఆరోగ్యశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో మరణాలకు, దగ్గు మందుకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. డైఇథలిన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథలిన్ గ్లైకాల్‌తో (ఈజీ) ఔషధాలు కలుషితమైనట్లు సీడీసీ తెలిపింది.
Gambia Cough Syrup Company Name : ఈ ఆరోపణలపై ఫిబ్రవరిలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో మాట్లాడారు. పరీక్షల తర్వాత దగ్గుమందుల నమూనాలు ప్రామాణిక నాణ్యతతో ఉన్నాయని ప్రకటించారు. డైఇథలిన్ గ్లైకాల్ (డీఈజీ), ఇథలిన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఆ ఔషధాల్లో లేవని ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ఆ దగ్గు మందు ఉత్పత్తి నిలిపివేత.. లైసెన్స్ రద్దు!
దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారు. హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో హరియాణా ఔషధ నియంత్రణ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ ఆదేశాలు జారీచేసింది. తనిఖీల సమయంలో అధికారులు లోపాలు గుర్తించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.