చైనా సరిహద్దుల వద్ద భారత్-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో సరికొత్త అస్త్రాన్ని భారత్ పరీక్షించింది. సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి, శత్రువులపై దాడికి డాగ్‌స్క్వాడ్‌లు ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు సేవలందిస్తున్నాయి. శిక్షణ పొందిన శునకాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది. ఇందు కోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్‌లను కూల్చేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. అది శత్రు డ్రోన్లను ఎలా నేలకూలుస్తుందో ఉత్తరాఖండ్‌లోని ఔలిలో జరుగుతున్న యుద్ధ అభ్యాస్ 2022లో భాగంగా భారత సైన్యం ప్రదర్శించింది. సైనికుడి చేతి నుంచి ఎగిరిన డేగ చిన్న డ్రోన్‌ను కూల్చివేసింది.
పంజాబ్, జమ్మూకాశ్మీర్ సరిహద్దులో డ్రోన్‌లను గుర్తించేందుకు భారత సైన్యం ఈ డేగను ఉపయోగిస్తోంది. ఈ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల తాకిడి ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ నుంచి ఉగ్రమూకలు డ్రోన్‌ల ద్వారా జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు, తుపాకులు, డబ్బుల్ని చేరవేస్తున్నారు. పాక్ నుంచి వచ్చే డ్రోన్‌లను కూల్చడంలో అర్జున్, డాగ్ స్వ్కాడ్‌భారత సైన్యానికి సాయపడుతున్నాయి.