China Comment On Kashmir: జమ్ముకశ్మీర్ గురించి మాట్లాడేందుకు చైనాకు ఎలాంటి హక్కు లేదని భారత్ స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించారు. దీన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ బుధవారం తీవ్రంగా తప్పుపట్టారు. జమ్ముకశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని పునరుద్ఘాటించారు. చైనా సహా ఏ ఇతర దేశానికీ దాని గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టీకరించారు.
ఇతరుల అంతర్గత వ్యవహారాలపై భారత్ ఎన్నడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయదన్న సంగతిని గుర్తించాలని హితవు పలికారు. "కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయి. చైనా కూడా అదే కోరుకుంటోంది" అని వాంగ్ వ్యాఖ్యానించిన సంగతి గమనార్హం. వాంగ్ ఈ వారంలో భారత్‌లో పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలొస్తున్న తరుణంలో తాజా వ్యవహారం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: బంగాల్ బీర్భుమ్ ఘటనపై మోదీ సీరియస్