తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ బలగాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన అన్ని ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించాలని భారత్ మరోమారు స్పష్టంచేసింది. సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై మంగళవారం ఇరు దేశాల మధ్య 11వ విడత చర్చలు జరిగాయి. ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి బుధవారం వెల్లడించారు.
ఉద్రిక్తతలు తలెత్తిన అన్నిచోట్లా ఇరువైపులా బలగాలను ఉపసంహరిస్తేనే శాంతి పునరుద్ధరణ సాధ్యమని భారత్ బృందం పునరుద్ఘాటించింది. మునుపు కుదిరిన ఒప్పందాల ప్రకారమే.. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు సమ్మతించాయి. వరుస చర్చల ఫలితంగా పాంగాంగ్ సరస్సు వద్ద ఇప్పటికే ఇరు దేశాల బలగాల ఉపసంహరణ పూర్తికాగా.. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దెప్సాంగ్ ప్రాంతాల్లో ఉపసంహరణపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.
ఇవీ చదవండి: సరిహద్దుల్లో డ్రాగన్ 'రెక్కల' చప్పుడు