చైనాలోని వుహాన్‌లో 2019 నవంబరులో వెలుగు చూసిన కొవిడ్ వ్యాధి అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచం ఇప్పటికీ కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. కరోనాతో 2020 తొలి రోజుల్లో చైనా నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో చైనా ఉత్పత్తులపై ఆధారపడిన ప్రపంచదేశాలు పలు సమస్యలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఔషధాలకు అవసరమైన ముడిసరకును చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకొంటోంది. ముడిసరకు లభ్యం కాకపోవడంతో ఆ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను చవిచూసింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో చైనాది కీలక పాత్ర. గడచిన మూడు దశాబ్దాలకు పైగా ప్రపంచానికి అవసరమైన పలు రకాల సామగ్రి ఉత్పత్తికి చైనా కేంద్రమైంది. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడి నుంచి దిగుమతులు రాకపోవడం, అంతర్జాతీయంగా సరఫరా ప్రక్రియ విచ్ఛిన్నం కావడంతో పలురకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
'చైనా ప్లస్ ఒన్'గా అవకాశాలెన్నో!
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏర్పడితే అధిగమించేందుకు చైనాతో పాటు కొన్ని ఇతర దేశాలను ప్రపంచ ఉత్పాదక కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా ఎస్‌సీఆర్‌ఐ(సరఫరా గొలుసు పునరుద్ధరణ కార్యక్రమం)ని ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు ప్రారంభించాయి. కొవిడ్‌తో అంతర్జాతీయంగా సరకు రవాణా గొలుసుకు భవిష్యత్తులో ప్రతికూలతలు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని 'చైనా ప్లస్ ఒన్ వ్యూహం'గా వ్యవహరిస్తున్నారు. ఇందులో డిజిటల్ టెక్నాలజీ, వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించాలని భాగస్వామ్య దేశాలు నిర్ణయించాయి. క్వాడ్ కూటమిలో అమెరికా తప్ప మిగిలిన మూడు దేశాలూ ఇందులో ఉన్నాయి. ప్రపంచానికి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆర్థిక కేంద్రబిందువుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసియాన్ దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపాలని ఆశించినా- ఈ దేశాలపై చైనా పరోక్ష ప్రభావం చూపుతుందనే ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను భారత్ అంగీకరించలేదు. ఇప్పటికే సులభతర వాణిజ్య విధానంతో పాటు అశేష మానవ వనరుల లభ్యతతో భారత్ పారిశ్రామికంగా ముందుకు దూసుకుపోతోంది. ఇవన్నీ 'చైనా ప్లస్ ఒన్' దేశంగా మారేందుకు ఇండియాకు అనుకూలిస్తున్నాయి.
చైనా ప్లస్ ఒన్ విధానానికి ఆసియాలోని థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా... తదితర దేశాలనుంచి భారత్‌కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు త్వరితంగా ఆమోదముద్ర వేయడం, మౌలిక సదుపాయాలకు పెద్దయెత్తున నిధులు కేటాయించడం ద్వారా థాయ్‌లాండ్ ఇప్పటికే ముందంజలో ఉంది. ఇక మలేసియాలో పెనాంగ్ ప్రాంతంలో ఇప్పటికే భారీగా పరిశ్రమలు ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెద్ద కంపెనీలు అక్కడ తమ సంస్థలను నెలకొల్పుతున్నాయి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమలకు అనువుగా ఆ దేశం డిజిటల్ బ్లూప్రింట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వియత్నామ్‌లో ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు కర్మాగారాలను ప్రారంభించాయి. అయితే చైనా ప్లస్ కేంద్రంగా మారేందుకు భారత్‌కు మరిన్ని అదనపు అవకాశాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్ ప్రాంతాలకు ఇండియా భౌగోళికంగా కీలకంగా ఉంది. మూడు వైపులా ఉన్న సముద్రతీరం, భారీ నౌకాశ్రయాలు విదేశీ కంపెనీలను ఆకట్టుకొంటాయి. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్‌ఐ) ఆశాజనకమైన ఫలితాలను రాబట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలెక్ట్రానిక్, వాహన, టెలికాం, సౌరశక్తి పరికరాల తయారీ... తదితర కీలక పది రంగాలను పీఎల్‌ఐ పరిధిలోకి తీసుకువచ్చింది.
రాష్ట్రాల సహకారం కీలకం
కేంద్రం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పలు పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు సైతం భారీయెత్తున ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాల్లో భాగంగా భారీగా రహదార్ల నిర్మాణం జరుగుతోంది. వీటి వెంబడి పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల చేయూతతో పథకాలను రూపొందించాలి. సులభతర వాణిజ్య విధానాలతో ఇప్పటికే పలు విదేశీ సంస్థలు మనదేశంలో పెట్టుబడులు పెట్టాయి. మనదేశంలో తక్కువ వేతనాలకు లభించే మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. చైనా ప్లస్ ఒన్ వ్యూహానికి భారత్ అత్యంత అనుకూలమని అనేక సంస్థలు పేర్కొన్నాయి. చైనాతో పోలిస్తే భారత్- ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాలకు దగ్గరగా ఉంది. దీంతో రవాణా వ్యయం సైతం తగ్గుతుంది. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పేందుకు మూలధనం తక్కువ కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం కలిసివచ్చే అంశాలు. ప్రత్యేకించి భారత సాఫ్ట్‌వేర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందుతున్నాయి. పారిశ్రామికంగా మన దేశానికి ఉన్న భౌగోళిక అనుకూలతలను ప్రపంచానికి తెలియజేస్తే... చైనా కంటే మిన్నగా భారత్ ప్రపంచానికి ఉత్పాదక వనరుల కేంద్రంగా ఆవిర్భవించగలదు.
- కొలకలూరి శ్రీధర్
ఇదీ చూడండి: US submarine: అమెరికా జలాంతర్గామికి ప్రమాదం.. చైనాకు అవకాశం..!