సాఫీగా సాగిపోతున్న జీవితంలో చిన్న చిన్న కారణాలతో కలత చెందిన కొందరు దంపతులు విడాకులు తీసుకోవాలనున్నారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించకుండా.. వారి పంతాలతో కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు. అయితే విడాకుల కోసం వారు ఆశ్రయించిన న్యాయస్థానమే వారిని కలిపింది. కర్ణాటకలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
క్షణికావేశంలోనే..
గదగ్ జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. దీనిలో ఐదు జంటల విడాకుల కేసులు పరిష్కారమయ్యాయి. చిన్నచిన్న కారణాలతో తలెత్తిన మనస్పర్థల వల్ల గొడవపడి దూరంగా ఉంటున్న వీరందరికీ జిల్లా జడ్జి మహాలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చారు. దంపతుల మధ్య సమస్యలకు విడాకులు మాత్రమే పరిష్కారం కాదని సూచించారు. వారు తిరిగి కలిసి జీవించేలా ఒప్పించారు. దీనితో ఈ ఐదు జంటలు తిరిగి కలిసిసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.
కోర్టులో సందడి..
ఒక్కటైన జంటలు దండలు మార్చుకుని, స్వీట్లు తినిపించుకున్నాయి. ఈ వ్యవహారంతో జిల్లా కోర్టులో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాన్ని చూసి ఇన్నాళ్లూ తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిన పిల్లలు ఎంతో ఆనందించారు. తమ అమ్మ, నాన్నను కలిపినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
విడాకుల కోసం వచ్చిన 'ఐదు' జంటలను తిరిగి కలపడం ఇదే మొదటిసారని న్యాయవర్గాలు తెలిపాయి. విడాకులతో ఎదురయ్యే అనర్థాలను ఈ జంటలకు అర్థమయ్యేలా వివరించినట్లు పేర్కొన్నాయి.
పిల్లల ముందు తిరిగి వివాహం చేసుకున్న ఆ జంటలు ఇలా కలవడం తమ జీవితంలో అరుదైన క్షణాలని చెప్పుకొచ్చాయి.
లోక్ అదాలత్ కార్యక్రమంలో ఇలానే మరో 4000 కేసుల్లో రాజీ కుదిరింది.
ఇవీ చదవండి: