ఉత్తరాఖండ్ తపోవన్ సమీపంలో ఏర్పడిన హిమ సరస్సు లోతును కొలిచేందుకు భారత వాయుసేన, నావికా దళం కలిసి రంగంలోకి దిగాయి. వాయుసేనకు చెందిన అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్(ఏఎల్‌హెచ్)లో బయలుదేరిన నేవీ డైవర్లు సరస్సు లోతును అంచనా వేస్తున్నారు.
రహదారులు సరిగా లేకపోవడం, అత్యవసరంగా సరస్సు లోతును తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాయుసేన, నేవీ కలిసి శనివారం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చేతిలో ఇమిడే ఎకో సౌండర్తో లోతును కొలుస్తున్నారని నేవీ తెలిపింది.
డ్యామ్ మట్టి గోడపై ఎంతమేర ఒత్తిడి పడుతుందనే విషయాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలకు ఈ సమాచారం ఉపయోగపడనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ వివరాల ప్రకారం సరస్సు.. 400 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో 60 మీటర్ల లోతు ఉంది.
హిమానీనదం బద్దలై ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల.. తపోవన్ సమీపంలో తాత్కాలిక నీటి సరస్సులు ఏర్పడ్డాయి. జలప్రళయం కారణంగా ఇప్పటివరకు 67 మంది మరణించారు. 137 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ విపత్తులో 65కు చేరిన మృతులు