మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీయగా.. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదన్న ఆయన.. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు బాబా రాందేవ్ క్షమాపణలు కోరినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలి చకాంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆయన పంపిన లేఖను కూడా పోస్టు చేశారు.
మహిళల సాధికారత కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాందేవ్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను తాను ప్రోత్సహించినట్లు చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదన్నారు రాందేవ్. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడినట్లయితే తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో జరిగిన యోగా సైన్స్ శిబిరంలో మహిళలపై బాబా రాందేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.