Nitish Kumar Opposition : రానున్న సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అధికారంలోకి వస్తే.. బిహార్‌తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం నీతీశ్ ప్రయత్నిస్తున్నారు. తన పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు భాజపా యత్నించిందనే ఆరోపణలతో గత నెలలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నీతీశ్ కుమార్.. మహాఘట్‌బంధన్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
బిహర్ నుంచి ఝార్ఖండ్ వేరే రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తన రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని రెండు దశాబ్దాలుగా నీతీశ్ తన గళాన్ని వినిపిస్తున్నారు. అంతేకాకుండా రెండు రాష్ట్రాల వేర్పాటు తరువాత బిహార్ రాష్ట్రం ఖనిజ సంపదను కోల్పోయిందని చెబుతున్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్రంలో ఏ సర్కారు ఉన్నా తన మద్దతు ఇస్తానని నీతీశ్ కుమార్ చాలా సందర్భాలలో ప్రకటించారు.
అంతకుముందు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్ రంగంలో దిగారు. ఈ నెల 5న దిల్లీలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను కలిశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వామపక్ష నేతలతో భేటీ అయ్యారు.
ఇవీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికిపైగా..
బాలుడిని ఢీకొట్టిన బస్సు.. తలకు గాయంతోనే స్కూల్‌కు విద్యార్థి.. స్పృహ తప్పి..