'సార్ మా ఊరికి రోడ్డు పడే వరకు నేను పెళ్లి చేసుకోను'.. కర్ణాటకకు చెందిన ఓ యువతి ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాసి చేసిన ప్రతిజ్ఞ ఇది. కేవలం ఒక రోడ్డు కోసం ఆ యువతి ఇలాంటి శపథం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ. కానీ ఆ గ్రామంలోని పరిస్థితి అలాంటిది మరి.
దావణగెరె(Karnataka Davanagere News) జిల్లాలోని ఓ మారుమూల గ్రామం రాంపుర(Rampura News). 40 ఇళ్లు ఉన్న ఈ ఊరికి కనీస సౌకర్యాలు కూడా లేవు. సరైన రోడ్డు లేక బస్సులు రాక.. అక్కడ చాలా మంది పిల్లల చదువులు ఆగిపోయాయి. స్కూల్కు వెళ్లాలనుకున్నవారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
ఈ సమస్య ఇక్కడితో ఆగలేదు. రాకపోకలకు గ్రామస్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంధువులూ అక్కడికి రావడం మానేశారు. రోడ్డు సమస్య వల్ల ఈ ఊరి యువతులను వివాహం చేసుకునేందుకు కూడా బయటివారు మొగ్గు చూపడం లేదు.

ఇక ఈ సమస్యలకు ఎలాగైనా పరిష్కారం కావాలని భావించిన బిందు.. తన గ్రామం పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai), ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాసింది.
"మాది 40 ఇళ్లు ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. మా గ్రామం ఇంకా రోడ్ల సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారం కోసమే నేను ముఖ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాశాను. "
- బిందు, లేఖ రాసిన యువతి
ఆమె లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. రాంపుర రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సీఎం హామీపై బిందు హర్షం వ్యక్తం చేసింది.
స్పందించిన కలెక్టర్..
'ఈటీవీ-భారత్' కథనానికి దావణగెరె జిల్లా కలెక్టర్ నుంచి స్పందన లభించింది. ఈ కథనం చదివిన తర్వాత కలెక్టర్ మహంతేశ్ బిలాగి.. దావణగెరె తాలుకా రాంపుర గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని రహదారి పరిస్థితులను చూసి.. ముఖ్యమంత్రికి లేఖ రాసిన యువతి బిందుకు ఓ హామీ ఇచ్చారు. 'తప్పకుండా ఈ గ్రామంలో రోడ్డు వేసి.. ఆ యువతికి వివాహం అయ్యేలా చేస్తాం' అని తెలిపారు.
ఇదీ చూడండి : black tiger: వీడిన నల్లపులి రంగు రహస్యం