PM Modi News: 8 ఏళ్ల భాజపా పాలన పేదల సంక్షేమానికి, సామాజిక భద్రతకు ఎంతో కృషి చేసిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. దీనికై చిన్న చిన్న ఉద్రిక్త ఘటనల కోసం వెతుకుతున్నాయని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. రాజస్థాన్ జైపుర్‌లో జరుగుతున్న భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.
2014 తర్వాత దేశ ప్రజలు నైరాశ్యం నుంచి బయటపడ్డారని.. నేడు ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారని మోదీ చెప్పారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని పదాధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలపై అంతకుముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని భాజపా మళ్లీ తీసుకువచ్చిందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆసక్తిగా చూస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. వాటి కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
"భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెలతో 8 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలను అందుకున్నాం. పేదల సంక్షేమం, సామజిక న్యాయం, సుపరిపాలనకు ఎంతో కృషిచేశాం. భాజపా అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. వారిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని భాజపా పదాధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: క్వాడ్ సదస్సు కోసం జపాన్‌కు మోదీ... ఆ నేతలతో చర్చలు!