Hyderabad Young Woman murder in Bangalore : నేటి కాలంలో యువత ఎక్కువగా ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఫలితంగా ప్రేమించిన అమ్మాయిని చంపడమో లేదా తాము చావడమో చేస్తున్నారు. తద్వారా వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. అక్కడే ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరువురూ వేరే ప్రాంతంలో ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు.
ఇక్కడే ఊహించని ట్విస్ట్ : కొన్ని రోజులు ఆ ప్రేమికులు బాగానే ఉన్నారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వారు ఇరువరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరగ్గా.. మృతురాలి తెలంగాణకు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. తమకు అండగా ఉంటుదనకున్న కుమార్తె విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మేదరి బస్తీకి చెందిన రాజస్థాన్ వ్యాపారి జ్ఞానేశ్వర్ కుమార్తె ఆకాంక్ష.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గతంలో ఆమె హైదరాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో.. దిల్లీకి చెందిన అర్పిత్ గుజ్రాల్‌తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు ప్రేమించుకోగా.. కొన్నాళ్లుగా ఆకాంక్ష బెంగళూరుకు వెళ్లింది. బెంగళూరులోని కోడిహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటుండగా.. స్నేహితురాలితో కలిసి ఉంటున్నట్లు తెలిసింది.
Akanksha Vidyasagar Suspicious Death Case : అక్కడే ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆకాంక్ష.. సోమవారం రాత్రి తన స్నేహితురాలు బయటికి వెళ్లి వచ్చేలోగా విగతజీవిగా పడిఉంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్థితిలో గమనించిన మృతురాలి స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆకాంక్షను హత్య చేసినట్లు బెంగళూరులోని జీవనబీమానగర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో అర్పిత్, ఆకాంక్ష కలిసే ఉండగా.. తాజాగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని డీసీపీ భీమాశంకర్ పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన అర్పిత్.. ఆకాంక్షను చంపినట్లు వివరించారు. యువతి మెడకు చున్నీ బిగించి హత్యచేసినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అదనపు సీపీ చంద్రశేఖర్.. పరారీలో ఉన్న అర్పిత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.
ఆకాంక్ష మృతితో స్వస్థలం గోదావరిఖనిలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు బెంగళూరు నుంచి స్వస్థలానికి తీసుకువచ్చారు. విగతజీవిగా వచ్చిన బిడ్డను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆమె మృతిపై మాట్లాడేందుకు కుటుంబసభ్యుల నిరాకరించారు. మరోవైపు ఆకాంక్ష అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి: Hyderabad Minor Girl rape : రక్షించాల్సిన వాడే రాక్షసుడై.. బాలికపై అత్యాచారం