ఎన్నో ఏళ్లుగా బందిపోట్లుకు నెలవుగా పేరున్న మధ్యప్రదేశ్ చంబల్ ప్రాంతంలో పరిస్థితులను మార్చడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదనడానికి సాక్ష్యంగా నిలిచింది బుధవారం జరిగిన ఓ సంఘటన. భిండ్ జిల్లాలో తుపాకులు పట్టుకుని చాలా మంది గుమికూడి, నినాదాలు చేస్తూ ఓ పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం కలకలం రేపింది.
కర్ఫ్యూ సమయంలో..
గోర్కి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరా కాచ్నవ్ గామానికి చెందిన రామ్ లక్ష్మణ్ బఘెల్ తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు బుధవారం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గమికూడటంపై నిషేధం ఉన్నప్పటికీ వారు ఈ వేడుకలను జరిపారు. చాలా మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్వాలియర్‌కు చెందిన గిరిరాజ్ పహిల్వాన్ అనే వ్యక్తి.. తన అనుచరగణంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం వారంతా తుపాకులతో ఓ క్వారీ గుంత వద్దకు చేరి.. హల్చల్ చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తాము వెళ్లేసరికి అక్కడ భారీగా జనం గుమిగూడి ఉండటం కనిపించిందని ఎస్పీ కమలేశ్ కుమార్ కుమార్ తెలిపారు. అయితే.. వారంతా వెంటనే పారిపోయారని చెప్పారు. కానీ, ఈ వేడుకలను నిర్వహించిన రాజేశ్ పుత్ర రామ్ లక్ష్మణ్ బఘెల్, గిరిరాజ్ పహిల్వాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
బందిపోటు పేరుతో నినాదాలు..
ఈ పుట్టినరోజుకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇందులో రాంబాబు గదారియా అనే బందిపోటు నాయకుడి పేరుతో నినాదాలను చేయటం ఈ వీడియోలో వినిపించింది. కానీ, ఈ విషయంపై అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ఇదీ చూడండి: అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు