శాస్త్ర సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ మూఢనమ్మకాలతో అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే తమిళనాడు తిరువారూర్లో జరిగింది. జ్యోతిషుల మాట విని సొంత కుమారుడినే సజీవ దహనం చేశాడో కిరాతక తండ్రి.
ఏం జరిగింది?
తిరువారూర్కు సమీపంలో ఉన్న నన్నిలామ్లోని పెరుమాళ్ ఆలయ వీధిలో 29 ఏళ్ల రామ్కీ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి భార్య గాయత్రి, ఐదేళ్ల కుమారుడు సాయిశరణ్ ఉన్నారు. ఆటోలు, కార్లు నడుపుతూ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు రామ్కీ.
మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. తన కొడుకు సాయిశరణ్ను తిడుతూ ఇంట్లో నుంచి బయటకు గెంటేసే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా.. సాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భర్త ప్రవర్తనతో గాయత్రి షాక్కు గురైంది.
సాయిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. 90 శాతం కాలిన గాయాలతో విలవిల్లాడుతున్న బాలుడ్ని తొలుత తిరువారూర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తంజావూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. శరీరం దాదాపు పూర్తిగా కాలిపోవటం వల్ల వైద్యానికి స్పందించని సాయి.. కాసేపటికే ప్రాణాలు విడిచాడు.
జ్యోతిషుల మాటతోనే!
రామ్కీని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. తన పురోగతికి సాయి అడ్డంకిగా మారాడని, అతడ్ని వదిలించుకుంటేనే కీడు పోతుందన్న జ్యోతిషుల మాట నమ్మి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని తిరువారూర్ కోర్టులో హాజరుపరిచి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చూడండి: వితంతు పెళ్లిపై కులపెద్దల ఆగ్రహం.. గ్రామ బహిష్కరణ