Fire Accident at Timber Depot : హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సికింద్రాబాద్ స్వప్నలోక్ ఘటన మరవకముందే తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ సాయి నగర్ కాలనీ వద్ద ఉన్న టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. టింబర్ డిపోలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు తీవ్రతరమయ్యాయి. క్షణాల్లోనే అక్కడ మొదలైన అగ్గి క్రమంగా పక్క భవనంలోకి వ్యాపించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ప్రమాదం జరగడంతో దట్టంగా అలుముకున్న పొగలు ఓ కుటుంబాన్ని కబళించాయి.
కమ్మకున్న పొగల ధాటికి ఊపిరాడక దంపతులు నరేశ్ , సుమ చిన్నకుమారుడు జోషిత్ మృత్యువాత పడ్డారు. టింబర్ డిపోలో అగ్నిప్రమాదంతో ఊరు నుంచి బతకడానికి వలస వచ్చిన ఓ పేద కుటుంబం బలైపోయింది. మృతులు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం వాసులు నరేశ్, సుమ, జోషిత్‌గా గుర్తించారు. నరేశ్ గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సుమ గృహిణిగా ఉండి ఉన్నంతలో పిల్లలను చదివించుకుంటున్నారు.
స్వస్థలాల్లో విషాదఛాయలు: అనుకోని ప్రమాదంలో మృత్యువాతపడటంతో వారి స్వస్థలాల్లో విషాదఛాయలు అలుమకున్నాయి. నరేశ్ , సుమల పెద్దకుమారుడు సమీపంలోని బంధువుల ఇల్లలో ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనాస్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. కుటుంబం మృత్యువాతపడటం బాధాకరమన్న మంత్రి బాధితకుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారాన్ని జీహెచ్‌ఎంసీ తరుఫున బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.
అన్ని విధాలా అండంగా ఉంటాం: ఇవాళ వేకువ జామున జరిగిన అగ్ని ప్రమాదంలో పక్క బిల్డింగ్‌లో నివసిస్తున్న కుటుంబం దట్టమైన పొగ కారణంగా శ్వాస ఆడక నిద్రలోనే మరణించారని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని అన్ని విధాలా అండంగా ఉంటామని విజయలక్ష్మి తెలిపారు.
"అగ్నిమాపక సిబ్బంది త్వరలోనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధకరంగా ఉంది. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు." - మహమూద్ అలీ, హోం మంత్రి
ఇవీ చదవండి: